గురుతర బాధ్యత..!

by Shyam |
గురుతర బాధ్యత..!
X

మేలిమి విత్తనాలను కూర్చుకుని
ఆయిటి పూనేదాక వేచివుంటాను
నల్లరేగడి నేలను తెల్లని సుద్దముక్కతో దున్ని
విజ్ఞానపు విత్తనాలను మెదడు పొరలలో వేస్తాను

అజ్ఞానం అనే కలుపుమొక్కలను నిత్యం ఏరివేస్తాను
ప్రశ్నలనే మొగ్గలకు జవాబు పూలు పూయిస్తా
విజ్ఞానపు సుగంధం విశ్వమంతా విస్తరింపజేస్తా
చక్కని పంటనుతీసి ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చి

చీకటి పొరలను తొలగించి వెలుగులు పూయిస్తున్నా
పుస్తకాల సారంతో మస్తిష్కపు పొరలు తడిపి
పాదు పాదుకు పదును చేరేదాకా వారితోనే గడిపి
క్రొవ్వొత్తిలా కరుగుతూ క్రొంగొత్తగా వెలుగు పంచుతూ

తరువులే ఆదర్శంగా భావిస్తూ గురువులా నీడనిస్తూ
రేపటి భారత భవితను భద్రంగా బడిలో పండిస్తున్నా
నేను చేసేది అక్షరాలతో వ్యవసాయం
నేను పొందేది నాణ్యమైన విజ్ఞాన ఫలసాయం

ప్రపంచానికంతా విజ్ఞాన ఫలాలను పంచి
విపత్కర సవాల్లకు పరిష్కారాలు చూపించుటకై
ఆశ్రమ విద్య నుండి ఆధునిక ఆన్లైన్ విద్య వరకు
గురువుగా గురుతర బాధ్యత నిర్వహిస్తున్నా…

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో…💐💐💐

-తంగెళ్ళపల్లి ఆనందాచారి,
9848683377

Advertisement

Next Story