ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా

by Javid Pasha |   ( Updated:2023-03-28 10:14:10.0  )
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. జూన్ 3 నుంచి 9 వరకు గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను ఏప్రిల్‌ 23 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. అయితే దీనిపై నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ప్రకటించిన కేవలం 85 రోజుల వ్యవధిలోనే మెయిన్స్‌ నిర్వహించడంపై వారు కమిషన్‌ను ఆశ్రయించారు. పరీక్షలకు సన్నద్ధం అవ్వడానికి సమయం సరిపోవడం లేదని అభ్యర్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ప్రిపరేషన్ కోసం నాలుగైదు నెలల సమయం ఇచ్చేవారని, కానీ ఈ సారి కనీసం మూడు నెలలు కూడా సమయం ఇవ్వకపోవడం ఏంటని వారంతా కమిషన్ నిలదీశారు. ఏప్రిల్‌, మే నెలల్లో యూపీఎస్సీకి సంబంధించిన పలు పరీక్షలు ఉంటాయని అభ్యర్థులు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రధాన పరీక్షలను వాయిదా వేయాలని, కనీసం నాలుగు నెలలైన సమయం ఇవ్వాలని ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ఏపీపీఎస్సీ మెయిన్స్ పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా 111 గ్రూప్‌ 1 పోస్టులకు ఈ ఏడాది జనవరి 8న గ్రూప్‌1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక 20 రోజుల అనంతరం ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed