నా టెంపర్ మెంట్ లూజ్ చేసుకుంటే తట్టుకోలేరు : చంద్రబాబు వార్నింగ్

by Anukaran |   ( Updated:2021-10-19 11:36:11.0  )
chandrababu
X

దిశ, ఏపీ బ్యూరో: ‘నా టెంపర్ లూజ్ అయితే మీరు తట్టుకోలేరు. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం రాష్ట్రంలో నడుస్తోంది. ఏపీలో ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కై దాడులు చేస్తున్నారు. నా 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇటువంటి ఘటనలు చూడలేదు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీ నేతలు ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరిగిన నేపథ్యంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. వైసీపీ దాడులకు నిరసనగా బుధవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంపై దాడులు చేయడం దేనికి సంకేతమని చంద్రబాబు ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యంపై దాడి

ఏపీలో గంజాయి సాగు గురించి పొరుగు రాష్ట్రాల డీజీపీలు చెబుతున్నారని అలాంటిది.. రాష్ట్రంలో గంజాయి సాగు పెరిగిందని టీడీపీ నేతలు చెప్పడం తప్పా అని చంద్రబాబు ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే దాడులు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. తమకు కూడా కోపం, ఆవేశం, బాధ, తపన ఉన్నాయని అయితే వాటన్నింటిని నిగ్రహించుకుంటున్నట్లు వెల్లడించారు. దాడి విషయం తమకు తెలియదని అంటున్న డీజీపీ ఆ పదవికి అర్హుడా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతుందని ఆరోపించారు.

‘దాడులకు పోలీసులు ముఖ్యమంత్రి బాధ్యులు. సీఎం, డీజీపీ బాధ్యత వహించాలి. టీడీపీ కార్యాలయాలను దేవాలయంగా భావిస్తారు. రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య పోరాటాలకు నిలువుటద్దం లాంటివి. 100 గజాల దూరంలో డీజీపీ ఆఫీసు ఉండి కూడా ఏమి చేయలేకపోయారు’ అని చంద్రబాబు ఆరోపించారు. ‘ఆర్గనైజ్డ్‌గా దాడులకు పాల్పడుతున్నారు. మీరు లాలూచీ పడే దాడి చేయించారు. డీజీపీకి, సీఎంకు తెలియకుండా జరిగిన దాడి కాదు. డ్రగ్ మాఫియాగా రాష్ట్రం మారింది. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి తరులుతుందని చెప్పడం కూడా తప్పా. మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడుకు ఇక్కడ నుంచే గంజాయి సరఫరా అవుతుంది. ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నించడం కూడా తప్పా. పార్టీ కార్యాలయంపై దాడి చేసి ప్రతిపక్ష నేతలను చంపాలని చూస్తారా. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల ఇళ్లపై కూడా దాడులు చేశారు. ఎంత మందిని చంపుతారు. మనుషులు ప్రాణాలు పోతుంటే సంయమనం పాటించాలని డీజీపీ స్టేట్మెంట్స్ ఇస్తారా ? డీజీపీ ఆఫీసుపై దాడి జరిగితే డీజీపీ కూడా సంయమనం పట్టిస్తారా.?’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

ఒక్క సెకను చాలు

‘నేను ఫోన్ చేసినా డీజీపీ ఎత్తలేదు. గవర్నర్, కేంద్రమంత్రికి ఫోన్ చేశా. వాళ్లు లిఫ్ట్ చేశారు. డీజీపీ ఎత్తడా? ఏమనుకుంటున్నారు. ఎన్ని బాధలున్నా నిగ్రహించుకుంటున్నాం. నా టెంపర్ మెంట్ లూజ్ చేసుకోవడానికి ఒక్క సెకను చాలు. నా ఇంటి గేటుకు తాళ్లు కట్టినప్పటి నుంచి ఈ అరాచకాలు ప్రారంభం అయ్యాయి. రెండున్నరేళ్లుగా మీ దాడులు చూస్తున్నాం. నా మనోధైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారు. కానీ అది మీ వల్ల కాదు. ఈ దాడులను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి’ అని చంద్రబాబు కోరారు.

మరోవైపు మా వాళ్లు భూతులు తిట్టిన వారించా. నేను ఎప్పుడు ఎవరిని భూతులు తిట్టలేదు. నన్ను, మా పార్టీ నేతలను ఎన్నిసార్లు బూతులు తిట్టారు. నన్ను ఎన్నిసార్లు తిట్టారు.. ఎలా తిట్టారో మీకు తెలీదా. అనరాని మాటలు అన్నారు. పరిధి దాటి మాట్లాడింది వైసీపీ నేతలే. చెప్పలేని చెప్పుకోలేని విధంగా బూతులు తిట్టారు. వైసీపీ నేతలు పరిధి దాటి మాట్లాడలేదా’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

నేను భయపడను.. వదిలిపెట్టను

టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌పై ఇది రెండోసారి దాడి జరిగిందని చంద్రబాబు స్పష్టం చేశారు. సెక్యూరిటీ ఇవ్వాలని కోరిన ఇప్పటి వరకు ఇవ్వలేదని చంద్రబాబు ఆరోపించారు. అరాచకాలు చేస్తూ భయపెట్టాలని చూస్తున్నారు. అప్రజాస్వామిక చర్యలు వద్దని చెప్పడమే మేము చేసిన తప్పా. డ్రగ్ మాఫియాతో దాడులు చేయిస్తారా. కార్యకర్తలకు నేను భరోసా ఇస్తున్నా.. ఎవరూ భయపడొద్దు. స్టేట్ టెర్రరిజంపై పోరాటం మేము చేస్తాం. కర్రలు, రాళ్లు, సుత్తులు, బీర్ బాటిళ్లతో దాడి చేస్తారా. తాగుబోతులను తీసుకొచ్చి దాడి చేయిస్తే నేను భయపడను. వైసీపీ నేతలను వదిలిపెట్టను. ప్రజల్లో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రాగానే ఇటువంటి దాడులు చేస్తున్నారు. హౌస్ అరెస్టులు చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed