నెట్‌ఫ్లిక్స్ రద్దు.. నిరసనల పద్దు

by Shyam |
నెట్‌ఫ్లిక్స్ రద్దు.. నిరసనల పద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏదైనా నచ్చకపోతే దాన్ని రద్దు చేయాలంటూ నిరసనలు చేయడం కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతటా ఉంది. అయితే ఈ నిరసనల్లో తేడా ఉంటుంది. అది సామాజిక అంశం అయితే ప్లకార్డ్స్, నినాదాలు పట్టుకుని రోడ్ల మీదికొస్తారు. కానీ ఇప్పుడు రోడ్ల మీదకొచ్చే పరిస్థితి లేదు కాబట్టి సోషల్ మీడియానే దిక్కు. మరి సోషల్ మీడియాలో నిరసనలు తెలపడానికి ఒక్క హ్యాష్‌ట్యాగ్ చాలు. నిరసన తెలపాలనుకున్న అంశానికి ముందు హ్యాష్‌ట్యాగ్ పెట్టి ‘కేన్సల్, బాయ్‌కాట్’ అనే పదాలు జోడిస్తే సరిపోతుంది. అయితే స్ట్రీమింగ్ సర్వీసుల విషయంలో ఇలాంటి బాయ్‌కాట్ రోజుకొకటి పుట్టుకొస్తోంది. అయితే నెట్‌ఫ్లిక్స్ మీద ఇప్పుడు ఇలాంటి నిరసన ఒకటి బాగా ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఆ నిరసన ఏంటి? దేని గురించో తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్‌ను ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ సర్వీస్‌లకు పెద్దన్న అని చెప్పుకోవచ్చు. ఇందులో ఎన్నో సీరియళ్లు, కార్యక్రమాలు, సినిమాలు, డాక్యుమెంటరీలు ఉన్నాయి. సబ్‌స్క్రిప్షన్ ఖర్చు ఎక్కువైనా ఆదరించే వాళ్లు కూడా అంతే ఎక్కువలో ఉన్నారు. ఎలాంటి నిబంధనలు లేని కంటెంట్ కారణంగా నెట్‌ఫ్లిక్స్‌ను చాలా మంది వ్యతిరేకించేవాళ్లూ ఉన్నారు. అయితే అప్పట్లో వారికి నచ్చని కార్యక్రమాన్ని లేదా షోని మాత్రమే తీసేయాలని నిరసన వ్యక్తం చేసేవారు. కానీ ఇప్పుడు ఏకంగా నెట్‌ఫ్లిక్స్‌నే రద్దు చేయాలని ‘కేన్సల్ నెట్‌ఫ్లిక్స్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. దీనంతటికీ కారణం ‘క్యూటీస్’ అనే సినిమా.

మైమోనా డైక్యురే దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్రెంచ్ సినిమాలో అమ్మాయిల సెక్సువలైజేషన్‌ను చాలా విమర్శనాత్మకంగా చూపించారని సంప్రదాయవాదులు గొడవ చేస్తున్నారు. 11 ఏళ్ల అమ్మాయి తన ఇంట్లో పెట్టిన నిబంధనలను కాదని, తల్లిదండ్రులను వ్యతిరేకించి డ్యాన్సింగ్ క్లబ్‌లో చేరడానికి ప్రయత్నించడమే ఈ సినిమా కథ. అంతేకాకుండా ఇందులో వర్ణవివక్ష, అమ్మాయిల సెక్సువాలిటీ, నేటి తరం మీద సోషల్ మీడియా ప్రభావం వంటి అంశాలను చూపించారు. అలాగే యువత స్వేచ్ఛను తప్పుగా చూపించే ప్రయత్నం చేశారంటూ విమర్శించారు. ఈ సినిమా పోస్టర్ కారణంగానే అసలు గొడవంతా ప్రారంభమైంది. ఫ్రెంచ్‌లో విడుదల చేసినపుడు ఈ సినిమాలోని నలుగురు అమ్మాయిలు షాపింగ్ చేస్తూ బయటికి వచ్చి వీధిలో ఎగురుతున్నట్లుగా చూపిస్తే, ఇంగ్లీష్‌లో విడుదల చేసినపుడు మాత్రం వేరే పోస్టర్‌ను మార్చారు. ఈ ఇంగ్లీష్ పోస్టర్‌లో పదకొండేళ్ల వయస్సున్న అమ్మాయిలు పొట్టి బట్టలు వేసుకుని ఎక్స్‌పోజ్ చేస్తున్నట్లు ఉండటం అందరికీ ఇబ్బందిగా అనిపించింది. దీంతో వివాదం ప్రారంభమైంది.

ఈ మాత్రం దానికే నెట్‌ఫ్లిక్స్ రద్దు చేయమనాలా? అని అనుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఉంది. ఇలాంటి వివాదాలు రావడం.. నెట్‌ఫ్లిక్స్ ఏదో ఒక సంజాయిషీ ఇచ్చుకోవడం పరిపాటిగా మారింది. దీంతో విసిగివేసారిపోయిన అభిమానులు ఏకంగా నెట్‌ఫ్లిక్స్ బ్యాన్ చేయాలని నిరసన తెలుపుతున్నారు. గతంలో ఒబామాలతో ఒప్పందం, ఓవర్ 365 డేస్, 13 రీజన్స్ వై కార్యక్రమాల వల్ల కూడా నెట్‌ఫ్లిక్స్ పెద్దఎత్తున విమర్శలు ఎదుర్కొంది. అయితే ఈసారి విపరీతంగా అభిమానించే అభిమానులు కూడా నెట్‌ఫ్లిక్స్‌కు ఎదురుతిరిగారు. సాధారణంగా కంటెంట్ నచ్చక నిరసనలు చేసే వారు ఉంటారు. కానీ ఈ వీరాభిమానులు మాత్రం తమకు నచ్చిన కంటెంట్‌ను నెట్‌ఫ్లిక్స్ మధ్యలోనే నిలిపివేసినందుకు నెట్‌ఫ్లిక్స్‌ను రద్దు చేయాలని అంటున్నారు. అర్థం కాలేదా?

ఈ ‘క్యూటీస్’ సినిమాకు వస్తున్న నిరసనలకు నెట్‌ఫ్లిక్స్ వీరాభిమానులు తోడవడంతో అది మరింత రచ్చగా మారింది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే జెస్సికా జోన్స్, ది ఓఏ, యానీ విత్ యాన్ ఈ అనే కార్యక్రమాలను పూర్తి ముగిసే వరకు ప్రసారం చేయకుండానే ఎలాంటి ముగింపును ఇవ్వకుండా మధ్యలోనే నెట్‌ఫ్లిక్స్ ఆపేసింది. ఆయా కార్యక్రమాలకు సరైన ముగింపును ఇవ్వాలని ఈ వీరాభిమానులు ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నారు. కానీ నెట్‌ఫ్లిక్స్ పట్టించుకోవడం లేదు. అందుకే ఈ క్యూటీస్ సినిమా నిరసనను వారు వారధిగా చేసుకుని కేన్సల్ నెట్‌ఫ్లిక్స్ అంటూ గొడవ చేస్తున్నారు. మరి ఈ వివాదం గురించి నెట్‌ఫ్లిక్స్ ఎలా స్పందిస్తుందో తెలియాలంటే వేచి చూడక తప్పదు.

Advertisement

Next Story

Most Viewed