- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొలిక్కి వస్తోన్న ఉద్యోగ ఖాళీలు.. కొత్త నోటిఫికేషన్లు వచ్చే ఏడాదిలోనే..?
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల లెక్క కొంత తేలింది. గత ఏడాది డిసెంబర్ నుంచి మొదలైన ప్రక్రియలో 11 నెలల తర్వాత కొంత స్పష్టత వచ్చింది. అయితే కేడర్ స్ట్రెంత్తేల్చిన తర్వాత ఖాళీలు మరిన్ని పెరిగే అవకాశాలున్నాయి. జోన్లు, జిల్లాల వారీగా విభజన పూర్తి అయిన తర్వాతే ఉద్యోగాల భర్తీపై ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో మొత్తం 86 వేల పోస్టులు ఖాళీలున్నట్లు నివేదికల్లో వెల్లడించారు. శాఖల వారీగా ఆర్థిక శాఖ ఈ వివరాలను సేకరించింది. అయితే దీనిలో కొన్ని పోస్టులను తాత్కాలికంగా ఎత్తివేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలా ఎత్తివేస్తే దాదాపు 11 వేల ఉద్యోగాలు లెక్కల్లోకి రావని తెలుస్తోంది. ప్రస్తుతం 86 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ.. ఏండ్ల తరబడి కొనసాగుతున్న పోస్టులను ఎత్తివేస్తే ఈ సంఖ్య 70 వేలకు చేరుతుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు విభజన ప్రక్రియపై ఇంకా స్పష్టత రాకపోవడంతో కొత్త ఉద్యోగాల భర్తీ ఈ ఏడాది కష్టంగానే మారుతోంది. వచ్చే ఏడాదిలోనే నోటిఫికేషన్లు రానున్నట్లు సమాచారం.
విద్యాశాఖతోనే ఆలస్యం
ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను తేల్చే అంశం నెలల తరబడి కొనసాగుతూ వస్తోంది. వాస్తవానికి గత ఏడాది డిసెంబర్‌లో సీఎం ప్రకటించినప్పటికీ.. చాలా రోజులు పెండింగ్‌లోనే ఉంది. ఆ తర్వాత మే 14, 15 తేదీల్లో నిర్వహించిన కేబినెట్ భేటీకి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం 56 వేల ఖాళీలున్నట్లు నివేదిక ఇచ్చింది. కానీ ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులకు, ఈ ఖాళీలకు పొంతన కుదరకపోవడంతో కేవలం ఐదు రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని సీఎస్‌ను కేబినెట్ ఆదేశించింది. కానీ పలు శాఖల నుంచి ఖాళీలపై స్పష్టత రాలేదు. ఎట్టకేలకు అన్ని శాఖల నుంచి వివరాలు అందినా.. విద్యాశాఖ నుంచి మాత్రం చాలా ఆటంకాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఎట్టకేలకు ఈ లెక్కలు తేల్చారు.
విద్యాశాఖ తరుఫున అన్ని జిల్లాల నుంచి డీఈఓలు ఇచ్చిన లెక్కల ప్రకారం లక్షా 20వేలు సాంక్షన్డ్ పోస్టులు ఉండగా.. ప్రస్తుతం 1.02 లక్షల వరకు టీచర్లు పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. 18వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారుల నివేదికలో తేల్చారు. మీడియంల వారీగా, సబ్జెక్టుల వారీగా, స్కూళ్ల వారీగా, మేనేజ్‌మెంట్ల వారీగా ప్రతి పోస్టు వివరాలను క్షుణ్ణంగా తీసినట్లు అధికారులు చెప్పుతున్నారు. తాజాగా రిపోర్టు ప్రకారం స్కూల్ అసిస్టెంట్–1,694, లాంగ్వేజ్ పండిట్–1,211, పీఈటీ–458, ఎస్‌జీటీ–8,862, హోంశాఖ–21,507, ఉన్నత విద్య–3,825 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ప్రస్తుతం విద్యాశాఖలో వివిధ కేడర్లలో 18,927 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు.
అయితే ప్రధానంగా హోంశాఖతో పాటుగా ప్రధాన శాఖల్లో ఖాళీలను తేల్చిన అధికారులు నివేదికను సిద్ధం చేసినట్లు తెలిసింది. ప్రధాన శాఖలతో పాటుగా రెవెన్యూలో 1,441, ఎస్సీ సంక్షేమంలో 1,967, మైనారిటీ సంక్షేమంలో 1,437, నీటి పారుదల శాఖలో (ఇంజినీర్లతో కలుపుకుని) 1,222, పురపాలక శాఖలో 1,148, అటవీశాఖలో 1,096, కార్మిక శాఖలో 980, వ్యవసాయ శాఖలో 742, పశుసంవర్థకశాఖలో 628, రోడ్లు భవనాలు, రవాణాలో 492, పరిశ్రమల శాఖలో 292, ఆర్థికశాఖలో 838, స్త్రీ శిశుసంక్షేమ శాఖలో 800, జీఏడీలో 220, సాంస్కృతిక, పర్యాటకంలో 69, ప్లానింగ్‌లో 65, పౌర సరఫరాల శాఖలో 48, అసెంబ్లీలో 38, ఇంధన శాఖలో 33, న్యాయ శాఖలో 26, ఐటీ శాఖలో 4 పోస్టులు ఖాళీలుండగా.. ఇతర ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లలో మరో 18 వేల పోస్టులు ఖాళీ ఉన్నట్లు గుర్తించారు.
1.71 లక్షలకు పెరిగిన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు
మరోవైపు రాష్ట్రంలో ఆయా శాఖల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ఉద్యోగుల జాబితా గణనీయంగా పెరిగింది. కొన్ని శాఖలు ఆర్థిక శాఖ అనుమతి లేకున్నా.. నిర్వహణ వ్యయం నుంచి వేతనాలిస్తూ తాత్కాలిక ఉద్యోగులను నియమించుకున్నారు. వీరి వివరాలన్నీ ఇప్పుడు ఆర్థిక శాఖకు ఇచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 1.18 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ఉద్యోగులు ఉన్నట్లు ప్రభుత్వం లెక్కలేసింది. కానీ ఈ సంఖ్య తాజాగా 1.71 లక్షలకు చేరింది. అయితే విద్యావలంటీర్లను కూడా లెక్కల్లోకి తీసుకుంటే తాత్కాలిక పద్ధతిన పని చేసే వారి జాబితా రెండు లక్షలు దాటుందని అధికారవర్గాలు చెప్పుతున్నాయి.
వచ్చే ఏడాదే నోటిఫికేషన్లు
ఇక ఇప్పుడు అధికార యంత్రాంగం ముందు సర్దుబాటు సమస్య క్లిష్టంగా మారింది. ఆర్డర్ టూ సర్వ్‌ను రద్దు చేసి, కేడర్ స్ట్రెంత్ఫిక్స్చేసిన తర్వాతే ఆఫ్షన్లు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై సీఎం కేసీఆర్‌తోనే తేల్చుకుంటామని ఉద్యోగ సంఘాల జేఏసీ సీఎస్‌కు అల్టిమేటం కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో సర్దుబాటుపై మళ్లీ బ్రేక్‌పడినట్లు అయింది. అయితే ఇప్పుడు ఖాళీల వివరాలు చేతికి అందడంతో.. కేడర్ స్ట్రెంత్ ఖరారు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఉద్యోగ సంఘాల జేఏసీ తరుఫున సీఎంను కలిసేందుకు అపాయింట్మెంట్కోరుతున్నారు. ప్రస్తుతానికి సీఎం నుంచి పిలుపురాలేదు.
మండలి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత అంటే.. వచ్చేనెలలో ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమవుతారని భావిస్తున్నారు. ఈ సమావేశానికి ముందే అధికారులు కూడా విభజనపై పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలోనే ఉద్యోగులు పనిచేస్తున్న పోస్టులు మాత్రమే కాకుండా శాఖల వారీగా మంజూరైన పోస్టులన్నింటినీ ఆప్షన్లకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగ సంఘాలు కూడా అదే డిమాండ్ చేశాయి. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు ఆప్షన్ల ప్రకారం వాటిని కేటాయించాల్సి ఉంది. దీనికి సంబంధించి ప్రాథమిక మార్గదర్శకాలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఇప్పటి వరకు అధికారులు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఒకే పోస్టుకు ఎక్కువగా ఆఫ్షన్లు ఇస్తే.. ముందుగా సీనియర్లు, స్థానికత వంటి వివరాలను తీసుకోవాలనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.
ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు చెప్పుతున్న అంశాల ప్రకారమైతే.. ఎక్కువ మంది ఆప్షన్లు ఇస్తే సీనియర్లకు ఇస్తారంటున్నారు. అంతేకాకుండా వికలాంగులు, వితంతువులు, కేన్సర్/కిడ్నీ వ్యాధిగ్రస్తులు, మానసిక వైకల్యం కలిగిన పిల్లలున్న వారు, స్పౌజ్, గుర్తింపు పొందిన సంఘాల వారికి, ఒంటరి మహిళలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ ప్రక్రియను ఈ ఏడాదిలోగా పూర్తి చేస్తేనే.. కొత్త నోటిఫికేషన్ల జారీ వచ్చే ఏడాది ఇచ్చేందుకు అవకాశం ఉంటోంది.
ప్రధాన శాఖల్లో ఖాళీలు
హోం శాఖ | 21507 |
విద్యా శాఖ | 18927 |
వైద్యారోగ్య శాఖ | 10048 |
బీసీ సంక్షేమం | 3538 |
గిరిజన సంక్షేమం | 1700 |
గ్రామీణాభివృద్ధి | 1391 |
మొత్తం ఖాళీలు | 86747 |