10 రంగాలు.. రూ.2లక్షల కోట్లతో పీఎల్ఐ పథకం!

by Shyam |   ( Updated:2020-11-11 06:59:14.0  )
10 రంగాలు.. రూ.2లక్షల కోట్లతో పీఎల్ఐ పథకం!
X

దిశ, వెబ్‌డెస్క్ : భారత్‌లో ఉత్పాదక సామర్థ్యాలను, ఎగుమతులను పెంచే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక (ప్రొడక్షన్ లింక్‌డ్ ఇన్సెంటివ్స్-పీఎల్ఐ) పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశీయంగా 10 రంగాలకు ఈ పథకం కింద ఐదేళ్లలో రూ. 2 లక్షల కోట్లకు పైగా ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఈ పథకం భారత తయారీదారులు ప్రపంచవ్యాప్తంగా పోటీపడేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు, ఎగుమతులను పెంచేందుకు దోహదపడుతుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు.

కొవిడ్-19 కారణంగా ఎక్కువగా దెబ్బతిన్న ఆటోమొబైల్ పరిశ్రమకు గరిష్ఠంగా రూ. 57,042 కోట్ల ప్రోత్సాహకాలు ఈ పథకం ద్వారా లభించనున్నాయి. అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్, ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్, ఫార్మా, టెలికాం, నెట్‌వర్క్‌లోకి ప్రవేశించిన ఇతర రంగాలు ఈ పథకం కింద చేర్చబడ్డాయి. బుధవారం ప్రకటించిన పీఎల్ఐ పథకం ఇదివరకు ప్రకటించిన భారత ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా అందిస్తున్నట్టు ప్రకాష్ జవదేకర్ అన్నారు. ‘పీఎల్ఐ పథకం దేశంలోని పెట్టుబడిదారులకు ప్రపంచవ్యాప్తంగా పోటీపడేందుకు అవసరమైన సామర్థ్యాన్ని అందిస్తుందని’ నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ చెప్పారు.

Advertisement

Next Story