దేశీయ కంపెనీలు పెట్టుబడుల్లో వెనకడుగు వేయడంపై ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు!

by sudharani |
దేశీయ కంపెనీలు పెట్టుబడుల్లో వెనకడుగు వేయడంపై ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు!
X

న్యూఢిల్లీ: దేశీయ కంపెనీలను ఉద్దేశించి కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశీ ఇన్వెస్టర్లు కూడా భారత్‌పై విశ్వాసంతో పెట్టుబడులు పెడుతున్నప్పటికీ, దేశీయ కంపెనీలు ఈ విషయంలో వెనకడుగు వేస్తున్నాయని తెలిపారు. మంగళవారం జరిగిన మైండ్‌మైన్ కార్యక్రమంలో మాట్లాడిన ఆర్థిక మంత్రి, అంతర్జాతీయ కంపెనీలు భారత్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. దేశీయ కంపెనీలు సైతం తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని, ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహకాలను అందిస్తోందన్నారు. ఇదివరకు పెట్టుబడులకు దేశంలో అనుకూల వాతావారణం లేదనే వాదన వినిపించిందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని కార్పొరేట్ పన్ను తగ్గించామన్నారు.

ప్రధానంగా ప్రైవేట్ రంగానికి మద్దతు ఇవ్వడంపై అనేక విమర్శలు వచ్చినప్పటికీ, పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామన్నారు. అంతేకాకుండా తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేలా దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో దేశీయ కంపెనీల నుంచి పెట్టుబడులు లేవన్నారు. ఏ విధానమూ సంపూర్ణంగా ఉండదు. ముందుకెళ్తున్న కొద్దీ అభివృద్ధి చెందుతుంది. వృద్ధి చెందుతున్న రంగంలోని పరిశ్రమలకు కూడా ఇది వర్తిస్తుంది. అందుకు ప్రభుత్వం నుంచి పాలసీ మద్దతు లభిస్తుంది. అనేక దేశాలు, విదేశీ కంపెనీలు భారత్‌కు పెట్టుబడుల కేంద్రంగా చూస్తున్నాయి. ఎఫ్‌పీఐ, ఎఫ్‌డీఐలు భారీగా వస్తున్నాయి. స్టాక్ మార్కెట్లు సమర్థవంతంగా ఉన్నాయి. ఈ తరుణంలోనే దేశీయ కంపెనీలు సొంత సామర్థ్యంపై విశ్వాసం చూపించాలన్నారు. భారత్‌లో ఉన్న పెట్టుబడుల వాతావరణం కారణంగానే చైనా నుంచి బయటకు వెళ్లే కంపెనీలు మన దేశానికి వస్తున్నాయన్నారు. ఇదే సమయంలో అంతర్జాతీయ లావాదేవీల్లో రూపాయి వినియోగం కోసం అవసరమైన చర్యలు తీసుకున్నామని, ఇప్పటికే పలు దేశాలతో జరిగిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల్లో రూపాయిని వాడేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించాయని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

Advertisement

Next Story