RBI: అన్ని ఖాతాలు, లాకర్ల నామినేషన్‌లను వెరిఫై చేయాలని బ్యాంకులను కోరిన ఆర్‌బీఐ

by S Gopi |
RBI: అన్ని ఖాతాలు, లాకర్ల నామినేషన్‌లను వెరిఫై చేయాలని బ్యాంకులను కోరిన ఆర్‌బీఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: కొత్త వారితో పాటు, ఇప్పటికే ఉన్న అన్ని ఖాతాదారుల డిపాజిట్ ఖాతాలు, సేఫ్టీ లాకర్లకు సంబంధించి నామినేషన్లను ధృవీకరించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) శుక్రవారం బ్యాంకులను కోరింది. పెద్ద సంఖ్యలో ఖాతాలకు నామినేషన్లు లేవని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. నామినేషన్ సౌకర్యం ద్వారా సదరు ఖాతాదారు మరణిస్తే నామినేట్‌గా సూచించిన వారి ఇబ్బందులను తగ్గించడానికి, కుటుంబ సభ్యుల క్లెయిమ్‌లను త్వరితగతిన పరిష్కరించేందుకు వీలవుతుంది. అయితే, ఆర్‌బీఐ ఇటీవలి సమీక్షలో అధిక సంఖ్యలో డిపాజిట్ ఖాతాలకు నామినేషన్ లేదని గుర్తించింది. మరణించిన డిపాజిటర్ల కుటుంబ సభ్యులు అసౌకర్యం, అనవసరమైన ఇబ్బందులను ఎదుర్కొనకుండా ఉండేందుకు.. ఇప్పటికే ఉన్న, కొత్త ఖాతాదారులకు డిపాజిట్ ఖాతాలు, సేఫ్టీ లాకర్లు ఉంటే గనక నామినేషన్ ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఆర్‌బీఐకి చెందిన దక్ష్ పోర్టల్‌లో 2025, మార్చి 31 నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి అప్‌డేట్ చేయాలని ఆర్‌బీఐ పేర్కొంది. అదేవిధంగా కస్టమర్లకు నామినేషన్ గురించి నేరుగా తెలియజేయడంతో పాటు నామినేషన్ సదుపాయం వల్ల కలిగే ప్రయోజనాలను స్పెషన్ డ్రైవ్ ద్వారా ప్రచారం చేయాలని సంబంధిత బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలను ఆర్‌బీఐ కోరింది.

Next Story