RBI: డిజిటల్ పేమెంట్‌లలో 83 శాతానికి పెరిగిన యూపీఐ వాటా

by S Gopi |
RBI: డిజిటల్ పేమెంట్‌లలో 83 శాతానికి పెరిగిన యూపీఐ వాటా
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో జరిగే మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ)ల వాటా గత ఐదేళ్లలో రెండింతలు పెరిగాయని ఆర్‌బీఐ నివేదిక వెల్లడించింది. 2019లో మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో 34 శాతంగా ఉన్న యూపీఐ చెల్లింపులు 2024 నాటికి 83 శాతానికి పెరిగాయి. మంగళవారం భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) విడుదల చేసిన డేటా ప్రకారం.. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్(నెఫ్ట్), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్(ఆర్‌టీజీఎస్), తక్షణ చెల్లింపు సేవ(ఐఎంపీఎస్), క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా జరిగే చెల్లింపుల వాటా 2019లో 66 శాతం నుంచి 2024, చివరికల్లా 17 శాతానికి తగ్గాయి. 2024లో దేశీయంగా 20 వేల కోట్లకు పైగా డిజిటల్ లావాదేవీలు నమోదయ్యాయి. దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగేందుకు ప్రధానంగా యూపీఐ లావాదేవీలు గణనీయంగా పెరగడమే కారణమని ఆర్‌బీఐ డేటా పేర్కొంది. 2019-2024 మధ్య రూ. 500 కంటే తక్కువ విలువైన యూపీఐ చెల్లింపుల్లో పీ2పీ(పర్సన్-టూ-పర్సన్) కంటే పీ2ఎం(పర్సన్-టూ-మర్చంట్) చెల్లింపుల అత్యంత వేగంగా పెరిగాయి. సమీక్షించిన కాలంలో పీ2ఎం లావాదేవీలు ఏటా 99 శాతం వృద్ధి నమోదు చేయగా, పీ2పీ 56 శాతం వార్షిక వృద్ధిని చూశాయని డేటా తెలిపింది. రూ. 2000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ చెల్లింపుల్లో పీ2ఎం లావాదేవీలు ఏడాదికి 109 శాతం చొప్పున, పీ2పీ లావాదేవీలు 57 శాతం చొప్పున పెరిగాయి. ఎన్‌పీసీఐకి చెందిన యూపీఐ లైట్ రోజుకు 20 లక్షల లావాదేవీలను నమోదు చేస్తోంది. యూపీఐ లైట్ సగటు లావాదేవీ విలువ 2023, డిసెంబర్‌లో 87 నుంచి 2024, డిసెంబర్ నాటికి రూ. 98కి పెరిగింది. డిజిటల్ వ్యాలెట్‌లను నిర్వహించే పీపీఐల లావాదేవీలు 12.3 శాతం క్షీణించాయని ఆర్‌బీఐ డేటా వెల్లడించింది.

👉 Dishadaily Web Stories

Advertisement

Next Story

Most Viewed