మొట్టమొదటి సీఎన్‌జీ బైకు తీసుకొస్తున్న బజాజ్

by S Gopi |
మొట్టమొదటి సీఎన్‌జీ బైకు తీసుకొస్తున్న బజాజ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైకు తీసుకురానున్నట్టు వెల్లడించింది. వచ్చే త్రైమాసికంలో దీన్ని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని మంగళవారం ఓ ఇంటర్వ్యూలో కంపెనీ ఎండీ రాజీవ్ బజాజ్ తెలిపారు. సీఎన్‌జీ మోటార్‌సైకిల్ ద్వారా ఇంధన ధర, నిర్వహణ ఖర్చు 50-65 శాతం మేర తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా సాంప్రదాయ ఇంధన వాహనాలతో పోలిస్తే ఉద్గార స్థాయి తక్కువగా ఉంటుంది. సీఎన్‌జీ బైకుల వల్ల కార్బన్ డయాక్సైడ్ 50 శాతం, కార్బన్ మోనాక్సైడ్ 75 శాతం, నాన్-మీథేన్ హైడ్రోకార్బన్ ఉద్గారాల్లో దాదాపు 90 శాతం తగ్గుతాయని కంపెనీ చెబుతోంది. కేవల ఒక మోటార్‌సైకిల్‌కే పరిమితం కాకుండా 100సీసీ నుంచి 160సీసీ వరకు అన్ని వేరియంట్లలో సీఎన్‌జీ బైకులను విడుదల చేస్తామని రాజీవ్ బజాజ్ వివరించారు. ప్రస్తుతానికి 125సీసీ సెగ్మెంట్‌పై కంపెనీ ఎక్కువ దృష్టి సారించింది. రానున్న రోజుల్లో దాదాపు ప్రతి 15 రోజులకు ఒక కొత్త బైకును విడుదల చేయాలనే లక్ష్యంతో ఉన్నట్టు ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story