TRAI: టెలికాం నిబంధనల అమలులో వెనక్కి తగ్గం: ట్రాయ్

by Harish |
TRAI: టెలికాం నిబంధనల అమలులో వెనక్కి తగ్గం: ట్రాయ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: టెలికాం సేవల్లో నాణ్యత ప్రమాణాలకు సంబంధించి నిబంధనల అమలు విషయంలో వెనక్కి తగ్గేది లేదని టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్‌ (TRAI) స్పష్టం చేసింది. సంస్థ ఛైర్మన్ అనిల్ కుమార్ లాహోటి మాట్లాడుతూ, వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, క్షుణ్ణంగా సంప్రదింపులు జరిపిన తర్వాత నిబంధనలు జారీ చేసినట్లు తెలిపారు. ఇటీవల ట్రాయ్ టెలికాం కంపెనీలకు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.. సేవల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే యూజర్లకు పరిహారం, వాటిని పాటించడంలో విఫలమైతే కంపెనీలకు విధించే జరిమానా పెంచుతూ ఇటీవల ట్రాయ్‌ నిబంధనలు తీసుకొచ్చింది.

కొత్త సర్క్యూలర్ ప్రకారం, 24 గంటలకు పైగా సర్వీస్ ఆగి పోయినట్లయితే టెలికాం ఆపరేటర్లు యూజర్లకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, నాణ్యమైన సేవలు అందించనందుకు కంపెనీలపై విధించే జరిమానా మొత్తాన్ని రూ.50,000 నుండి రూ. 1 లక్షకు పెంచారు. వివిధ ప్రమాణాల ఉల్లంఘనలకు గ్రేడ్ విధానాన్ని ప్రవేశపెట్టి రూ.1 లక్ష, రూ. 2 లక్షలు, రూ.5 లక్షలు, రూ.10 లక్షల పెనాల్టీ విధిస్తామని ట్రాయ్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

సెల్యులార్ మొబైల్, బ్రాడ్‌బ్యాండ్, బ్రాడ్‌బ్యాండ్ వైర్‌లెస్ సేవల్లో టెలికాం కంపెనీలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ట్రాయ్ తెలిపింది, అలాగే, వీటి అమలుకు ఆరు నెలల గడువును నిర్దేశించింది. అయితే ఈ కొత్త నిబంధనలపై టెలికాం కంపెనీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వీటి విషయంలో ట్రాయ్ పునరాలోచించాలని అవి భావిస్తుండగా, నిబంధనల అమలు విషయంలో వెనక్కి తగ్గేది లేదని ట్రాయ్ స్పష్టం చేయడం గమనార్హం.

Advertisement

Next Story