ఐటీ దిగ్గజాల నుంచి అత్యధిక వేతన ఉద్యోగుల రాజీనామా

by S Gopi |   ( Updated:2024-01-09 06:03:20.0  )
ఐటీ దిగ్గజాల నుంచి అత్యధిక వేతన ఉద్యోగుల రాజీనామా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ దిగ్గజ కంపెనీలైన ఇన్ఫోసిస్, విప్రో రెండింటిలోనూ అత్యధిక జీతాలు తీసుకున్న 10 ఉద్యోగుల్లో ముగ్గురు కంపెనీలను విడిచిపెట్టారు. వారిలో చాలామంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు పోటీ కంపెనీల్లో చేరడం గమనార్హం. ఇన్ఫోసిస్‌లో మోహిత్ జోషి(మాజీ ప్రెసిడెంట్), కృష్ణమూర్తి శంకర్(హెచ్ఆర్ గ్రూప్ హెడ్), నిలంజన్ రాయ్(సీఎఫ్ఓ) అత్యధిక వేతనం తీసుకుంటున్న మొదటి 10 మంది జాబితాలో ఉన్నారు. మోహిత్ జోషి ఇన్ఫోసిస్‌లో అత్యధికంగా రూ. 57 కోట్ల వేతనం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన టెక్ మహీంద్రాలో చేరారు. శంకర్ రూ. 13 కోట్ల జీతంతో కంపెనీ నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్నారు. నిలంజన్ రాయ్ రూ. 10.6 కోట్ల జీతాన్ని తీసుకోగా, ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నది వెల్లడించలేదు. విప్రో నుంచి జతిన్ దలాల్ రూ. 8.9 కోట్లు(మాజీ సీఎఫ్ఓగా), సత్య ఈశ్వరన్ రూ. 3.6 కోట్లు(ఇండియా హెడ్‌గా), హరి రాజా ఎస్ రూ. 3.3 కోట్లు (గ్లోబల్ సేల్స్‌ఫోర్స్ ప్రాక్టీస్ హెడ్‌గా) జీతంతో బయటకు వెళ్లారు. జతిన్ దలాల్ ప్రస్తుతం గ్లోబల్ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌లో సీఎఫ్ఓగా ఉంటూనే, విప్రోతో చట్టపరమైన వివాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఈశ్వరన్ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ కంపెనీ ఆర్థర్ డా లిటిల్‌లో ఇండియా బిజినెస్ హెడ్‌గా, హరి రాజా ఎర్నెస్ట్ అండ్ యంగ్‌లో పార్ట్‌నర్‌గా చేరారు.

Advertisement

Next Story