నిషేధం ఎత్తివేతతో సంతోషంలో ఉల్లి రైతులు

by Disha Web Desk 17 |
నిషేధం ఎత్తివేతతో సంతోషంలో ఉల్లి రైతులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్రం ఉల్లి రైతులకు భారీ శుభవార్త చెప్పింది. దాదాపు కొన్ని నెలలుగా అమల్లో ఉన్న ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని తొలగించింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే, ప్రభుత్వం కనీస ఎగుమతి ధర టన్నుకు సుమారు రూ.45,860(550 డాలర్ల) గా నిర్ణయించింది. ఈ నిర్ణయం చాలా మంది రైతుల ఆదాయాన్ని పెంచడంలో సహాయపడుతుంది. గత ఏడాది ఉత్పత్తి తగ్గిపోవడం, అలాగే ధరలు అధికంగా పెరగడంతో కేంద్రం డిసెంబర్ 8న ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. మార్చి 3 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొన్న కేంద్రం శనివారం ఆంక్షలను ఎత్తివేసింది.

గత కొంత కాలంగా దేశవ్యాప్తంగా ఉల్లి రైతులు ఎగుమతులపై నిషేధాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలోని నాసిక్, అహ్మద్‌నగర్, షోలాపూర్ వంటి కీలకమైన ఉల్లి మార్కెట్లలో రైతులు ఆశించిన మేరకు ధరలు రావడం లేదని మంచి లాభాలు రావాలంటే ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని పేర్కొంటున్నారు. ఇప్పుడు ఈ ఆంక్షలను తొలగించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకోవడం గమనార్హం.

వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే మాట్లాడుతూ, వినియోగదారులు, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రబీ సీజన్‌లో ఉల్లి ఉత్పత్తి 191 లక్షల టన్నులుగా ఉంటుందని ఆమె అంచనా వేశారు. ఒకవేళ ధరలు మళ్లీ పెరిగినట్లయితే ప్రభుత్వం 5 లక్షల టన్నుల ఉల్లిపాయలను బఫర్ స్టాక్‌గా సేకరిస్తున్నందున ధరలను, లభ్యతను అదుపులో ఉంచవచ్చని కార్యదర్శి తెలిపారు.

డేటా ప్రకారం, 2023-24లో (మొదటి ముందస్తు అంచనాలు) ఉల్లి ఉత్పత్తి గత ఏడాది 302.08 లక్షల టన్నులతో పోలిస్తే దాదాపు 254.73 లక్షల టన్నులుగా ఉంటుందని అంచనా. మహారాష్ట్రలో 34.31 లక్షల టన్నులు, కర్ణాటకలో 9.95 లక్షల టన్నులు, ఆంధ్రప్రదేశ్‌లో 3.54 లక్షల టన్నులు, రాజస్థాన్‌లో 3.12 లక్షల టన్నుల ఉత్పత్తి తగ్గడమే ఇందుకు కారణమని గణాంకాలు చూపిస్తున్నాయి.

Next Story

Most Viewed