వరుస లాభాలతో స్టాక్ మార్కెట్ల ర్యాలీ

by S Gopi |
వరుస లాభాలతో స్టాక్ మార్కెట్ల ర్యాలీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో వరుస లాభాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు, కీలక ఆటో, ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లో కొనుగోళ్లతో శుక్రవారం ట్రేడింగ్‌లోనూ సూచీలు మెరుగ్గా ర్యాలీ చేశాయి. ఈ క్రమంలోనే నిఫ్టీ తిరిగి 22,000 మైలురాయిని అధిగమించింది. నిఫ్టీ మేజర్లు ఎల్అండ్‌టీ, ఇన్ఫోసిస్, ఎంఅండ్ఎం షేర్లలో ర్యాలీ కలిసొచ్చింది. తాజాగా విడుదలైన గణాంకాల్లో భారత వాణిజ్య లోటు తగ్గడంతో మదుపర్లు కన్స్యూమర్ గూడ్స్, మెటల్, ఇండస్ట్రియల్ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపించారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 376.26 పాయింట్లు లాభపడి 72,426 వద్ద, నిఫ్టీ 129.95 పాయింట్ల లాభంతో 22,040 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఆటో, ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్, రియల్టీ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో విప్రో, ఎంఅండ్ఎం, ఎల్అండ్‌టీ, మారుతీ సుజుకి, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, నెస్లె ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు అధిక లాభాలను సాధించాయి. పవర్‌గ్రిడ్, ఎస్‌బీఐ, రిలయన్స్, ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.01 వద్ద ఉంది. ఆటో రంగం షేర్లలో ర్యాలీ కారణంగా ద్విచక్ర వాహన తయారీ కంపెనీ టీవీఎస్ షేర్ శుక్రవారం 4 శాతం పైగా లాభపడి రూ. 2,816 వద్ద ముగిసింది. ఇదే సమయంలో కంపెనీ మార్కెట్ విలువ రూ. లక్ష కోట్ల మార్కును అధిగమించింది.

Advertisement

Next Story