వరుసగా మూడో రోజు పతనమైన స్టాక్ మార్కెట్లు

by S Gopi |   ( Updated:2024-01-18 12:20:15.0  )
వరుసగా మూడో రోజు పతనమైన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల రికార్డు ర్యాలీతో కొత్త గరిష్ఠాలకు చేరిన స్టాక్ మార్కెట్లు గత మూడు సెషన్లలో వరుసగా అధిక నష్టాలను చూస్తున్నాయి. గురువారం ట్రేడింగ్‌లోనూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో పాటు దేశీయంగా మదుపర్లు గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణకు దిగడంతో అమ్మకాల ఒత్తిడి కనబడింది. ఇదే సమయంలో దిగ్గజ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు సైతం వరుసగా అమ్మకాల ఒత్తిడితో పతనమవుతున్నాయి. అయితే, గురువారం సెషన్‌లో కీలక బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 900 పాయింట్ల కంటే ఎక్కువ నష్టాలను చూసినప్పటికీ తర్వాత కోలుకున్నాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 313.90 పాయింట్లు కోల్పోయి 71,186 వద్ద, నిఫ్టీ 109.70 పాయింట్లు నష్టపోయి 21,462 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు రాణించగా, ఫైనాన్స్, మెటల్, ప్రైవేట్ రంగ బ్యాంకులు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో సన్‌ఫార్మా, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఎంఅండ్ఎం, ఎల్అండ్‌టీ కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎన్‌టీపీసీ, టైటాన్, ఏషియన్ పెయింట్, పవర్‌గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లె ఇండియా స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.14 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed