కంపెనీల షేర్‌లో కొంత భాగం కొనే విధానం అమలు చేసే యోచనలో సెబీ!

by Shiva |   ( Updated:2023-09-06 10:08:21.0  )
కంపెనీల షేర్‌లో కొంత భాగం కొనే విధానం అమలు చేసే యోచనలో సెబీ!
X

ముంబై: స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) రిటైల్ మదుపర్ల కోసం కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఉంది. ఖరీదైన లేదా అధిక ధర కలిగిన షేర్లను సగటు రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని సెబీ భావిస్తోంది. దీన్ని ఫ్రాక్షనల్ ట్రేడింగ్ అంటారు. అంటే పెట్టుబడిదారులు ఖరీదైన షేర్‌లో కొంత భాగాన్ని కొనుగోలు చేసే విధానం.

ఉదాహరణకు ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ ఒక్క షేర్ ధర ప్రస్తుతం రూ. 1.08 లక్షలుగా ఉంది. ఈ కంపెనీ ఒక్క షేర్ కొనాలన్నా పెట్టుబడిదారులు లక్షకు పైనే వెచ్చించాల్సి ఉంటుంది. ఇది సాధారణ రిటైల్ ఇన్వెస్టర్‌కు సాధ్యమయ్యే పనికాదు. కాబట్టి అటువంటి షేర్లలో పాక్షిక భాగం కొనేందుకు అనుమతిస్తే, ఇన్వెస్టర్లు షేర్ ధరలో కొంత భాగం కొనేందుకు వీలవుతుంది. దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఒక్కో షేర్ ధర రూ. 20,000 కంటే ఎక్కువ ఉన్న కంపెనీలు చాలానే ఉన్నాయి.

పేజ్ ఇండస్ట్రీస్(రూ. 40,711), హనీవెల్ ఆటోమేషన్ ఇండియా(రూ. 39,080), శ్రీ సిమెంట్(రూ. 25,649), అబాట్ ఇండియా(రూ. 23,147), నెస్లే ఇండియా(రూ. 22,053) సహా ఇంకా అనేక కంపెనీలున్నాయి. అమెరికా మార్కెట్లలో ఇప్పటికే ఒక కంపెనీ షేర్‌లో కొంత భాగం కొనే విధానం అమల్లో ఉంది. చాలామంది భారతీయ ఇన్వెస్టర్లు సైతం యాపిల్, మెటా(ఇదివరకు ఫేస్‌బుక్), ఆల్ఫాబెట్ లాంటి దిగ్గజ కంపెనీల షేర్లలో కొంత భాగం కొనుగోలు చేస్తున్నారు.

ముంబైలో జరుగుతున్న గ్లోబల్ ఫిన్‌టెక్ సదస్సులో సెబీ ఛైర్‌పర్సన్ మాధవి పూరి బుచ్ దీనిపై స్పందించారు. షేర్ ధరలో పాక్షిక భాగం కొనే విధానాన్ని అమలు చేయడంపై తాము ఆసక్తిగానే ఉన్నామని, అయితే, సెబీ చట్టం, కంపెనీల చట్టంలో మార్పులు చేయాల్సి ఉందని ఆమె తెలిపారు.

Advertisement

Next Story