భారత కంపెనీల్లో ప్రీ-పాండమిక్ స్థాయిలకు చేరిన జీతాల పెంపు!

by Harish |
భారత కంపెనీల్లో ప్రీ-పాండమిక్ స్థాయిలకు చేరిన జీతాల పెంపు!
X

న్యూఢిల్లీ: దేశంలోని కంపెనీల్లో జీతాల పెంపు కరోనా మహమ్మారి ముందు నాటి స్థాయికి తిరిగి వచ్చిందని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. 2021లో సగటున వేతన పెరుగుదల 8 శాతంగా ఉండగా, గత ఏడాది ఇది 9-9.5 శాతంగా ఉందని ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ మెర్సర్స్ టోటల్ రెమ్యూనరేషన్ నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా 1,300 కంపెనీల నుంచి సేకరించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది సైతం సగటున జీతాల పెరుగుదల 9-9.5 శాతం మధ్యే ఉంటుందని కంపెనీ అంచనా వేసింది.

దాదాపు అన్ని కంపెనీల్లో జీతాల పెంపుదల ప్రీ-పాండమిక్ దశకు చేరుకుంటున్నాయని, తయారీ, కన్స్యూమర్, రిటైల్, కెమికల్, ఆటోమొబైల్స్‌తో సహా చాలా పరిశ్రమలు రివార్డులు, ప్రోత్సాహకాలను కరోనా ముందు స్థాయిలో అందిస్తున్నాయని మెర్సెర్స్ రివార్డ్స్ కన్సల్టింగ్ లీడర్ మన్సీ సింఘాల్ చెప్పారు.

టెక్, హెల్త్‌కేర్, సర్వీసెస్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ వంటి పరిశ్రమలో ఈ పెరుగుదల ఊహించిన దాని కంటే మెరుగ్గా ఉంది. ఈ పరిశ్రమలు వేగవంతంగా డిజిటలైజేషన్ వైపునకు మారుతుండటం, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులకు, సేవలకు డిమాండ్ అధికంగా ఉండటం వంటి కారణాలతో అధిక జీతాల పెరుగుదలను నమోదు చేశాయి. ఇక, ఈ ఏడాది హైటెక్ పరిశ్రమలో అత్యధిక జీతాల పెరుగుదల ఉంటుందని, దీని తర్వాత సాఫ్ట్‌వేర్ సర్వీస్ ఔట్‌సోర్సింగ్‌లో ఎక్కువగా ఉంటుందని నివేదిక వెల్లడించింది.

Advertisement

Next Story