భారీగా పెరుగుతున్న రైల్వే స్టాక్‌ల ధరలు..కారణం ఇదే..

by Harish |
భారీగా పెరుగుతున్న రైల్వే స్టాక్‌ల ధరలు..కారణం ఇదే..
X

దిశ, బిజినెస్ బ్యూరో: రాబోయే 2024-25 యూనియన్ బడ్జెట్‌లో రైల్వేకు ప్రభుత్వం భారీగా నిధులను కేటాయిస్తుందని పెట్టుబడిదారులు ఆశిస్తున్న కారణంగా గత కొద్ది రోజులుగా రైల్వే స్టాక్‌లు ఎన్నడూలేని విధంగా రికార్డ్ గరిష్టాలకు చేరుకుంటున్నాయి. ఇంతకుముందు 2023-24 బడ్జెట్‌లో, రైల్వే మంత్రిత్వ శాఖ రికార్డు స్థాయిలో రూ. 2.4 లక్షల కోట్ల నిధలను అందుకోగా ఈసారి అంతకంటే ఎక్కువగా నిధులు వచ్చే అవకాశం ఉంది. దీంతో గత కొద్ది నెలలుగా స్థిరంగా ఉన్న రైల్వే షేర్ల ధరలు 2024 ఏడాది ప్రారంభం నుంచి మాత్రం భారీగా పెరుగుతున్నాయి.

ముఖ్యంగా రైల్ వికాస్ నిగమ్ (RVNL), ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC), ఇర్కాన్ ఇంటర్నేషనల్, NBCC (ఇండియా), RailTel కార్పొరేషన్ ఆఫ్ ఇండియా,Texmaco రైల్ అండ్ ఇంజనీరింగ్ స్టాకులు చరిత్రలో రికార్డు స్థాయి ధరకు చేరుకున్నాయి. RVNL షేర్ ధర 2023 మార్చి నెలలో రూ. 64 గా ఉండగా ప్రస్తుతం అది రూ.320 కి చేరుకుంది. IRFC షేర్ ధర మార్చి 2023 లో రూ.26 కాగా ఇప్పుడు అది రికార్డు స్థాయి రూ.176 కు చేరుకుంది. ఇర్కాన్ ఇంటర్నేషనల్ షేర్ ధర మార్చి 2023 లో రూ.54 కాగా ప్రస్తుతం అది రూ.266 కు చేరుకుంది.

ఏడాది కాలంలోనే రైల్వే స్టాకులు పెట్టుబడిదారులకు 100 శాతం కంటే ఎక్కువ లాభాలను అందించాయి. రానున్న రోజుల్లో కేంద్రం కొత్త రైల్వే ప్రాజెక్టులను చేపట్టాలని చూడటం, రైళ్ల భద్రత, కొత్త వందే భారత్ రైళ్లు, స్టేషన్ల పునరాభివృద్ధి, కొత్త ట్రాక్‌ల నిర్మాణం, బుల్లెట్ ట్రైన్ వంటి వాటికి భారీ ఎత్తున నిధులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రైల్వేకు సంబందించిన అన్ని స్టాకులు రయ్ మంటు దూసుకుపోతున్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ 2024-25 యూనియన్ బడ్జెట్‌లో రైల్వేలకు సుమారు రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపులను అంచనా వేసింది, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 25 శాతం పెరుగుదలను ప్రతిబింబిస్తుంది.

Next Story

Most Viewed