ఏడాదికి రూ.399 చెల్లిస్తే చాలు.. పోస్టాఫీసులో రూ.10 లక్షల ఇన్సూరెన్స్

by Harish |   ( Updated:2023-05-02 13:41:15.0  )
ఏడాదికి రూ.399 చెల్లిస్తే చాలు.. పోస్టాఫీసులో రూ.10 లక్షల ఇన్సూరెన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో రోడ్డు మీద వెళ్తుంటే ఎటువైపు నుంచి ఏ ప్రమాదం పొంచి ఉందో తెలియని పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా యాక్సిడెంట్ల ద్వారా చాలా మంది ప్రజలు చనిపోతున్నారు. అదే విధంగా కొందరు అంగ వైకల్యం కూడా పొందుతున్నారు. రోడ్డు ప్రమాదం మూలంగా వ్యక్తి ప్రాణాలనే కాదు, వారి మొత్తం కుటుంబాన్నే నడిరోడ్డు మీద నిలబెడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రమాద బీమా చేయించుకోవడం చాలా చాలా ముఖ్యం.

అందుకే ప్రభుత్వ ఆధ్వర్యంలోని పోస్టాఫీసు దేశవ్యాప్తంగా అద్బుతమైన బీమా పాలసీని అందిస్తుంది. దీని పేరు ‘గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ పాలసీ(Group Accident Guard Policy)’. యాక్సిడెంట్ జరిగిన సమయాల్లో ఈ పాలసీ ఉపయోగపడుతుంది. ప్రమాదంలో పాలసీ తీసుకున్న వారు ప్రమాదవశాత్తు మరణించిన లేదా శాశ్వత అంగవైకల్యం కలిగినా, వారికి రూ. 10 లక్షల బీమా లభిస్తుంది. ఇది వారి కుటుంబానికి ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుంది.

పోస్టాఫీసు, టాటా ఏఐజీ (Tata AIG General Insurance Company)తో కలిసి ఈ పాలసీని అందిస్తుంది. గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ పాలసీలో రెండు రకాల స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. మొదటిది రూ. 299 ప్లాన్, రెండోది రూ. 399 ప్లాన్. ఈ రెండు ప్లాన్‌లలో కూడా ఏడాదికి ఒకసారి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి రూ. 299 లేదా రూ. 399లను చెల్లిస్తే మొత్తం రూ. 10 లక్షల బీమా పొందవచ్చు. 18 నుంచి 65 ఏళ్ల మధ్యలో వయసు కలిగిన వారు ఈ స్పెషల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోడానికి అర్హులు. ఈ పాలసీని ప్రతి ఏటా రెన్యూవల్ చేసుకోవాలి. అలాగే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో అకౌంట్ కలిగి ఉండాలి.

రూ. 299 ప్లాన్ బెనిఫిట్స్: ఈ ప్లాన్‌లో పాలసీదారులు ప్రమాదంలో మరణించినా, అంగవైకల్యం పొందినా లేక పక్షవాతం వచ్చినా రూ.10 లక్షల వరకు అందిస్తారు. ఒకవేళ గాయపడి హాస్పటల్‌లో ఇన్‌పేషెంట్‌గా చేరితే ఖర్చుల కోసం రూ. 60వేలు, అవుట్‌ పేషెంట్‌ (ఓపీడీ)గా చికిత్స తీసుకుంటే రూ. 30వేలు అందిస్తారు.

రూ. 399 ప్లాన్ బెనిఫిట్స్: ఈ ప్లాన్‌లో పాలసీదారులు ప్రమాదంలో మరణించినా, అంగవైకల్యం పొందినా లేక పక్షవాతం వచ్చినా రూ.10 లక్షల వరకు అందిస్తారు. అంత్యక్రియల కోసం రూ. 5 వేలు కూడా ఇస్తారు. వారి పిల్లలకు చదువుల నిమిత్తం రూ. లక్ష అందజేస్తారు. ఒకవేళ గాయపడి హాస్పటల్‌లో ఇన్‌పేషెంట్‌గా చేరితే ఖర్చుల కోసం రూ. 60వేలు, అవుట్‌ పేషెంట్‌ (ఓపీడీ)గా చికిత్స తీసుకొంటే రూ. 30 వేలు అందిస్తారు. హాస్పటల్‌లో రోజువారి ఖర్చుల నిమిత్తం రోజుకు రూ.1000 లను 10 రోజుల వరకు అందిస్తారు. హాస్పిటల్ నుంచి ఇంటికి రవాణా ఖర్చుల కోసం రూ. 25,000 వరకు అందిస్తారు.

రెండు ప్లాన్‌ల మధ్య తేడా ఏమిటంటే రూ. 399 ప్లాన్‌లో అంత్యక్రియల ఖర్చులు, రవాణా ఖర్చులు, హాస్పటల్ ఖర్చులు, పిల్లల చదువుకు ఇచ్చే డబ్బు వంటివి ఉన్నాయి, కానీ రూ. 299 పథకంలో ఇవేమి ఉండవు. ఇతర పూర్తి సమాచారం కోసం దగ్గరలోని పోస్టాఫీసులో సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed