ఎన్‌పీఎస్ పథకం నుంచి విత్‌డ్రాకు కొత్త నిబంధనలు

by S Gopi |
ఎన్‌పీఎస్ పథకం నుంచి విత్‌డ్రాకు కొత్త నిబంధనలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: రిటైర్‌మెంట్‌ తర్వాత ఆర్థిక భద్రతను కల్పించే లక్ష్యంతో భారత ప్రభుత్వం తీసుకొచ్చిన 'జాతీయ పింఛను పథకాని (ఎన్‌పీఎస్)’కి సంబంధించి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ(పీఎఫ్ఆర్‌డీఏ) కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇవి ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అప్‌డేట్ చేసిన నిబంధనల ప్రకారం, ఎన్‌పీఎస్ సబ్‌స్క్రైబర్లు తమ వ్యక్తిగత పెన్షన్ ఖాతాకు యాజమాన్య వాటా మినహాయించి వారి కంట్రిబ్యూషన్‌లలో 25 శాతం కంటే ఎక్కువ విత్‌డ్రా చేయలేరు. అలాగే, చందాదారులు తమ సబ్‌స్క్రిప్షన్ వ్యవధిలో మూడుసార్లు మాత్రమే పాక్షిక ఉపసంహరణ అవకాశం పొందగలరు. దీనికి అర్హత పొందాలంటే సబ్‌స్క్రైబర్లు తప్పనిసరిగా ఈ పథకంలో కనీసం మూడేళ్లు సభ్యులుగా ఉండాలి. పిల్లల విద్యా ఖర్చులు, వివాహ, ఇంటి నిర్మాణ, అత్యవసర వైద్య పరిస్థితుల కోసం ఎన్‌పీఎస్ పథకంలోంచి పాక్షిక మొత్తాన్ని విత్‌డ్రా తీసుకునేందుకు అనుమతి ఉంటుంది. అంతేకాకుండా సబ్‌స్క్రైబర్ వైకల్యం లేదా అనూహ్యంగా ఏర్పడే వైద్య అవసరాలకు, నైపుణ్యాభివృద్ధి లేదా రీ-స్కిల్లింగ్ కోసం, చందాదారుడు వెంచర్ లేదా ఏదైనా స్టార్టప్ కోసం చేసే ఖర్చుల కోసం పాక్షికంగా విత్‌డ్రా చేయవచ్చు.

Advertisement

Next Story

Most Viewed