EVs: పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో ఈవీల ఛార్జింగ్‌పై జీఎస్టీ మినహాయింపు కుదరదు

by S Gopi |
EVs: పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో ఈవీల ఛార్జింగ్‌పై జీఎస్టీ మినహాయింపు కుదరదు
X

దిశ, బిజినెస్ బ్యూరో: పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌లలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) ఛార్జింగ్‌పై 18 శాతం జీఎస్టీ మినహాయింపును జీఎస్టీ ఫిట్‌మెంట్ కమిటీ తిరస్కరించింది. వాహన పరిశ్రమ నుంచి ఈవీల ఛార్జింగ్‌పై జీఎస్టీ తొలగించాలని వచ్చిన అభ్యర్థనలు పరిశీలించిన జీఎస్టీ ప్యానెల్ అందుకు నిరాకరించింది. ఈవీల ఛార్జింగ్ ప్రక్రియ అనేది రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఎలక్ట్రిసిటీ యాక్సెస్, ఛార్జింగ్ స్టేషన్‌ను ఉపయోగించడం కోసం అనుబంధ ఛార్జీలు వంటివి ఉన్నాయి. నిబంధనల ప్రకారం, విద్యుత్ శక్తి సరఫరా జీఎస్టీ నుంచి మినహాయించబడింది. అలాగే, విద్యుత్ ప్రసారం, పంపిణీకి సంబంధించిన సేవలకు కూడా జీఎస్టీ మినహాయింపు ఉంది. వీటిని పరిగణలోకి తీసుకుని ఈవీ ఛార్జింగ్ సేవలకు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని పరిశ్రమ వర్గాలు కోరాయి. అయితే, ఇటీవల కర్ణాటక అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్(ఏఏఆర్) పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌లలో బ్యాటరీలను ఛార్జింగ్ చేసే కార్యకలాపాలపై జీఎస్టీని సమర్థించింది. ఇందుకు కారణాలను వివరిస్తూ.. ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌లలో అందించే సేవలు కేవలం విద్యుత్ సరఫరా మాత్రమే కాదు, ఇతర సేవలు కూడా మిళితమై ఉంటాయి. అవి ఛార్జింగ్ కోసం కావాల్సిన సౌకర్యాలు, సేవలు. కాబట్టి జీఎస్టీ విధింపు సమంజసమే అని ఏఏఆర్ పేర్కొంది. ఈవీ బ్యాటరీని ఛార్జ్ చేయడం విద్యుత్ వినియోగించే సేవ అని, విక్రయం కాదని గతంలో విద్యుత్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఫలితంగా, ఈవీ వినియోగదారులు పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో ఛార్జింగ్‌కి 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందే.

Advertisement

Next Story