IT Bill: వచ్చే వారం కేబినెట్ ముందుకు కొత్త ఐటీ బిల్లు

by S Gopi |
IT Bill: వచ్చే వారం కేబినెట్ ముందుకు కొత్త ఐటీ బిల్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త బిల్లు అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన బిల్లును వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టునున్నారు. కొత్త ఆదాయపు పన్ను చట్టంలో సుదీర్ఘ వాక్యాలు, నిబంధనలు, వివరణలు ఉండవని ఆర్థిక శాఖ కార్యదర్శి తుహిన్ కాంత పాండె గురువారం ప్రకటనలో తెలిపారు. పాత చట్టంలో ఉన్నవాటి కంటే కొత్త దానిలో నిబంధనలు అందరికీ అర్థమయ్యే విధంగా సులభంగా ఉండనున్నట్టు ఆయన పేర్కొన్నారు. వచ్చే శుక్రవారం కేబినెట్‌లో దీనిపై చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో కొత్త బిల్లు గురించి ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త బిల్లులో ఆదాయపు పన్ను రేట్లు, శ్లాబ్‌లు, 2025-26 బడ్జెట్‌లో టీడీఎస్ నిబంధనలలో చేసిన మార్పులు ఉండనున్నాయి. కొత్త ఆదాయపు చట్టం పూర్తి భిన్నంగా ఉంటుందని, చట్టాన్ని రూపొందించే పద్దతిలో చాలా మార్పును గమనిస్తారు. సుధీర్ఘ వివరణ ఉండే వాక్యాలు ఎక్కువగా కనిపించవని పీహెచ్‌డీ ఛాంబర్స్ కార్యక్రమంలో తుహిన్ కాంత పాండె వివరించారు. కొత్తగా ఎటువంటి పన్నులు, అదనపు భారం ఉండదు. కొత్త చట్టం సరళంగా ఉంటుంది. కేవలం న్యాయ నిపుణులకు మాత్రమే కాకుండా, సామాన్యులు కూడా అర్థం చేసుకునే ఉద్దేశంతో బిల్లును రూపొందించినట్టు పేర్కొన్నారు.

Next Story

Most Viewed