27 వేలకు పైగా తాత్కాలిక ఉద్యోగాలు చేపట్టనున్న మింత్రా!

by Manoj |
27 వేలకు పైగా తాత్కాలిక ఉద్యోగాలు చేపట్టనున్న మింత్రా!
X

న్యూఢిల్లీ: ప్రముఖ ఫ్యాషన్ ఈ-కామర్స్ సంస్థ మింత్రా జూన్ 11 నుంచి ప్రారంభించబోయే సేల్ కోసం భారీ ఎత్తున తాత్కాలిక ఉద్యోగాలను నియమించనున్నట్టు వెల్లడించింది. సీజనల్ సేల్స్‌లో భాగంగా వినియోగదారుల నుంచి రాబోయే అత్యధిక ఆర్డర్లను సరైన సమయంలో అందించేందుకు ఏకంగా 27,500 మందిని నియమించుకుంటున్నామని కంపెనీ తెలిపింది. తాత్కాలికంగా సీజనల్ సేల్స్ ముగిసే వరకు ఈ ఉద్యోగాలు ఉంటాయని, వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించడానికి ఈ స్థాయిలో ఉద్యోగులు కావాలని భావిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నందిత సిన్హా చెప్పారు.

మింత్రా కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌కు అనుబంధంగా కొనసాగుతున్న ఆన్‌లైన్ రిటైల్ షాపింగ్ ప్లాట్‌ఫామ్. గతేడాది ఇదే సమయంలో 11 వేలకు పైగా తాత్కాలిక ఉద్యోగాలను కల్పించామని కంపెనీ పేర్కొంది. ఈ ఏడాది తీసుకునే 27,500 మందిలో 2000 ఉద్యోగాలను మహిళల కోసం రిజర్వ్ చేశామని, మరో 300 దివ్యాంగుల కోసం కేటాయించినట్టు కంపెనీ వివరించింది. దివ్యాంగులకు కంపెనీకి చెందిన గోడౌన్స్ నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నట్టు నందితా సిన్హా తెలిపారు. మొత్తం నియామకాల్లో 85 శాతం మందిని డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లుగా నియమిస్తామని కంపెనీ వెల్లడించింది. కస్టమర్ సర్వీస్ కార్యకలాపాల కోసం 1,400 మందిని చేరుకోనున్నట్టు తెలిపింది. ఈ ఏడాది మింత్రా కంపెనీ సీజనల్ సేల్స్ ద్వారా గతంలో కంటే 50 శాతం అధిక ఆర్డర్లను అంచనా వేస్తున్నామని కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed