Income Tax: రూ. 50 లక్షలకుపైగా సంపాదిస్తున్న వారి నుంచే అధిక ఆదాయపు పన్ను వసూళ్లు

by S Gopi |
Income Tax: రూ. 50 లక్షలకుపైగా సంపాదిస్తున్న వారి నుంచే అధిక ఆదాయపు పన్ను వసూళ్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ పదేళ్ల హయాంలో రూ. 20 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న మధ్యతరగతి వారిపై పన్ను భారం తగ్గింది. ఇదే సమయంలో పన్ను చెల్లింపుదారుల్లో రూ. 50 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని బుధవారం ప్రకటనలో ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్) ఫైలింగ్ డేటా ప్రకారం.. 2023-24లో రూ. 50 లక్షల కంటే ఎక్కువ వార్షికాదాయం ఉన్న వారి సంఖ్య 9.39 లక్షలకు పెరిగింది. 2013-14లో ఉన్న 1.85 లక్షల మంది కంటే ఇది ఐదు రెట్లు అధికం. అంతేకాకుండా వారు చెల్లించే మొత్తం రూ. 2.52 లక్షల కోట్ల నుంచి 2024 నాటికి 3.2 రెట్లు పెరిగి రూ. 9.62 లక్షల కోట్లకు చేరుకుంది. ఆదాయపు పన్నులో 76 శాతం మంది మొత్తం రూ. 50 లక్షలకు పైగా ఆదాయం ఉన్న వారి నుంచి వసూలవుతున్నట్టు గణాంకాలు పేర్కొన్నాయి. అందువల్లే మధ్యతరగతి ప్రజలపై పన్ను భారం తగ్గింది. 2014లో రూ. 10 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారుల నుంచి 10.17 శాతం మేర పన్ను ఆదాయం రాగా, 2024 నాటికి ఇది 6.22 శాతానికి తగ్గింది. ఇక, వ్యక్తిగత ఆదాయపు పన్ను రిటర్నుల సంఖ్య 2013-14లో 3.60 కోట్లు ఉండగా, 2023-24 నాటికి 7.97 కోట్లతో 121 శాతం పెరిగాయని గణాంకాలు పేర్కొన్నాయి.

Advertisement

Next Story

Most Viewed