SEBI: ఏసీబీ కోర్టు ఆదేశాలపై బాంబే హైకోర్టును ఆశ్రయించిన మాధవి బుచ్

by S Gopi |
SEBI: ఏసీబీ కోర్టు ఆదేశాలపై బాంబే హైకోర్టును ఆశ్రయించిన మాధవి బుచ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: స్టాక్ మార్కెట్లలో అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనల కారణంగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ మాజీ చీఫ్ మాధవి పూరి బుచ్ సహా మరో ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ముంబై ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి తాజాగా మాధవి పూరి బుచ్ ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ఆమెతో పాటు బీఎస్ఈ సీఈఓ, ఎండీ సుందరరామన్ రామమూర్తి, సెబీ లైఫ్‌టైమ్ మెంబర్లు అనంత్ నారాయణ్, అశ్వనీ భాటియా, కమలేశ్ చంద్ర హైకోర్టుకు వెళ్లారు. ఏసీబీ కోర్టు ఆదేశాలను కొట్టివేయాలంటూ వారు అత్యవసర విచారణ చేపట్టాలని విన్నవించారు. వారి పిటిషన్‌ను మార్చి 4న విచారించడానికి జస్టిస్‌ ఎస్‌జీ డిగే నేతృత్వంలోని సింగిల్‌ బెంచ్‌ అంగీకరించింది. అప్పటివరకు ఏసీబీ స్పెషల్ కోర్టు ఆదేశాలను అమలు చేయొద్దని బెంచ్ స్పష్టం చేసింది. సెబీ అధికారుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, బీఎస్ఈ అధికారుల తరఫున సీనియర్ న్యాయవాది అమిత్ దేశాయ్ వాదించారు. సెబీ చైర్‌పర్సన్‌గా మాధవి బుచ్ పదవీకాలం పూర్తయిన రెండు రోజులకే ముంబై వర్లీలోని ఏసీబీ కోర్టు ఎఫ్ఐఆర్ నమోదుకు ఉత్తర్వులు జారీ చేసింది. స్టాక్ మార్కెట్లో అవకతవకలు, నిబంధనల ఉల్లంఘన ఆధారంగా కేసు నమోదుకు ఆదేశాలిచ్చింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఏసీబీ కోర్టు ఆదేశాలను అనుసరించి, మాధవి బుచ్‌కు మద్దతుగా సెబీ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. పిటిషన్ అప్రయోజనమైనదని పేర్కొంది.

Advertisement
Next Story