Banking Laws: ఇకపై బ్యాంకు ఖాతాలకు నలుగురు నామినీలను ఎంచుకునే అవకాశం

by S Gopi |
Banking Laws: ఇకపై బ్యాంకు ఖాతాలకు నలుగురు నామినీలను ఎంచుకునే అవకాశం
X

దిశ, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ నిబంధనల్లో గణనీయమైన మార్పులను ప్రతిపాదిస్తూ పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు-2024కు ఆమోదం లభించింది. సవరణ బిల్లులో ప్రధానంగా బ్యాంకు ఖాతాదారులు తమ సాధారణ అకౌంట్లతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ల కోసం ఇకపై నలుగురు నామినీలను ఎంచుకోవచ్చు. ఇప్పటివరకు బ్యాంకు అకౌంట్లకు ఒకరిని మాత్రమే నామినీగా ఎంచుకునే వీలుండేది. కొవిడ్-19 మహమ్మారి సమయంలో తలెత్తిన సమస్య కారణంగా, ఖాతాదారుడు మరణించిన తర్వాత నిధుల పంపిణీ చేసే ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు వీలుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మార్పును తీసుకొచ్చింది. దీంతో పాటు బ్యాంకుల్లో డైరెక్టర్‌షిప్ హోదా కోసం కనీస వాటా పరిమితిని పెంచేందుకు బిల్లు ప్రతిపాదించింది. ప్రస్తుతం ఇది రూ. 5 లక్షలు ఉండగా, ఇది దాదాపు 60 ఏళ్ల క్రితం నిర్దేశించారు. తాజా బిల్లులో దీన్ని రూ. 2 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల చట్టబద్ధమైన ఆడిటర్‌ల వేతనాన్ని నిర్ణయించడంలో బ్యాంకులకు ఎక్కువ స్వేచ్ఛను ఇస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అలాగే ఇకమీదట డిపాజిటర్లు నలుగు నామినీలను ఎంచుకునే అవకాశం ఇస్తున్నామన్నారు. లాక్ సదుపాయం ఉన్నవారు ఒకరి తర్వాత మరొకరిని నామినీలను ఎంపిక చేయవచ్చని బిల్లు ఆమోదం సందర్భంగా ఆర్థిక మంత్రి సభలో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed