- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
JSW Steel: ప్రపంచంలోనే అత్యంత విలువైన స్టీల్ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ స్టీల్

దిశ, బిజినెస్ బ్యూరో: సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్రపంచంలోనే అత్యంత విలువైన ఉక్కు కంపెనీగా అవతరించింది. ప్రపంచ దిగ్గజాలైన న్యూకోర్, ఆర్సెలర్ మిట్టల్, నిప్పాన్ స్టీల్‌లను దాటి మరీ జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఈ ఘనతను సాధించింది. మంగళవారం నాటికి కంపెనీ వాల్యుయేషన్ రూ. 2,59,670 కోట్లకు లేదా దాదాపు 30.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కంపెనీ షేర్ ధర సైతం జీవిత గరిష్ఠ స్థాయి రూ. 1,074.15కి చేరింది. గడిచిన ఏడాది కాలంలో కంపెనీ 29.26 శాతం అధిక రాబడిని ఇచ్చింది. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీగా జేఎస్‌డబ్ల్యూ స్టీల్ అమెరికా, ఇటలీలో విదేశీ కార్యకలాపాలతో పాటు దేశీయంగా విజయనగర్, డోల్వి, సేలంలలో స్టీల్ ప్లాంట్‌లను నిర్వహిస్తోంది. కంపెనీ ప్రస్తుతం 35.7 మిలియన్ టన్నుల (ఎంటీ) ఉక్కు తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనిని 2027-28 నాటికి 43.5 ఎంటీలకు, 2030-31 నాటికి 51.5 ఎంటీలకు పెంచాలని లక్ష్యంగా ఉంది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ హాట్ రోల్డ్, కోల్డ్ రోల్డ్ కాయిల్స్ దిగుమతులపై 12 శాతం సుంకాన్ని ప్రతిపాదించిన నేపథ్యంలో గత కొన్ని సెషన్‌లుగా భారతీయ స్టీల్ కంపెనీల స్టాక్‌లు ర్యాలీ చేస్తున్నాయి. దీనికి తోడు డిమాండ్ పెరగడం కూడా కంపెనీ విలువ పెరిగేందుకు దోహదపడింది. మార్కెట్ విలువ ప్రకారం టాప్ 10 జాబితాలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ తర్వాత ఏకైక భారతీయ కంపెనీ టాటా స్టీల్ మాత్రమే ఉంది. కంపెనీ 22.9 బిలియన్ డాలర్ల విలువతో ఐదో స్థానంలో ఉంది. టాప్-5లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ తర్వాత న్యూకోర్ స్టీల్ 29.4 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో, 26.9 బిలియన్ డాలర్లతో ఆర్సెలార్ మిట్టల్ మూడో స్థానంలో, 24.5 బిలియన్ డాలర్లతో నిపాన్ స్టీల్ నాలుగో స్థానంలో ఉన్నాయి.