గుడ్‌న్యూస్: ఇకపై వయసుతో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్‌

by Disha Web Desk 17 |
గుడ్‌న్యూస్: ఇకపై వయసుతో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్‌
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆరోగ్య బీమా తీసుకోవాలనుకునే వారికి బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) భారీ గుడ్‌న్యూస్ చెప్పింది. పాలసీల కొనుగోలుకు సంబంధించి ఉన్నటువంటి వయస్సు పరిమితిని తొలగించింది. సాధారణంగా ఆరోగ్య బీమా కొనుగోలుకు గరిష్ట వయస్సు 65 ఏళ్లుగా ఉండగా, దానిని తొలగించారు. ఇకమీదట ఏ వయస్సు గల వారైనా ఆరోగ్య పాలసీలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కొత్త మార్పు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్‌ చేసుకోవచ్చు. ఈ నిర్ణయంతో 65 ఏళ్లు పైబడిన వారు, అన్ని వయస్సుల వారికి ఉపయోగం ఉంటుంది.

ఇకపై బీమా సంస్థలు సీనియర్ సిటిజన్‌లు, విద్యార్థులు, పిల్లలు, గర్భిణులు, కాంపిటెంట్ అథారిటీ ద్వారా నిర్దేశించిన అన్ని వయసుల వారికి ప్రత్యేకంగా పాలసీలను రూపొందించవచ్చని IRDAI నోటిఫికేషన్‌లో పేర్కొంది. దీని వలన అందరికీ ఆరోగ్య సంరక్షణ చేరువవుతుంది. సీనియర్ సిటిజన్‌ల వంటి నిర్దిష్ట వయస్సుల వారి కోసం ప్రత్యేక పాలసీలను ప్రవేశపెట్టాలని, వారి క్లెయిమ్‌లు, ఫిర్యాదులను నిర్వహించడానికి ప్రత్యేక చానెల్‌లను ఏర్పాటు చేయాలని బీమా నియంత్రణ సంస్థ ఆదేశించింది.

కొత్త నోటిఫికేషన్ ప్రకారం, క్యాన్సర్, గుండె లేదా మూత్రపిండ వైఫల్యం, AIDS వంటి తీవ్రమైన వ్యాధులు కలిగి ఉన్న వ్యక్తులకు పాలసీలను జారీ చేయడానికి బీమా సంస్థలు నిరాకరించడం కుదరదు. అలాగే, ఆరోగ్య బీమా వెయిటింగ్ పిరియడ్‌ను నాలుగు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాలకు తగ్గించారు. దాంతో పాలసీదారు వ్యాధులను మొదట్లో వెల్లడించాడా లేదా అనే దానితో సంబంధం లేకుండా 36 నెలల తర్వాత క్లెయిమ్ కవర్ చేయాలి. ముందస్తు వ్యాధులను కారణంగా చూపి బీమా సంస్థలు క్లెయిమ్‌లను తిరస్కరించడానికి వీలుండదు. పాలసీల మారటోరియం వ్యవధి 8 ఏళ్లు కాగా, దానిని 5 ఏళ్లకు తగ్గించారు. కొత్త నిబంధనలతో ఆరోగ్య బీమా కిందకు మరింత మంది చేరతారని అధికారులు తెలిపారు.



Next Story

Most Viewed