ముడి చమురు రేట్లు తగ్గడంతో భారీగా లాభపడ్డ భారత్

by Disha Web Desk 17 |
ముడి చమురు రేట్లు తగ్గడంతో భారీగా లాభపడ్డ భారత్
X

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా ముడి చమరు రేట్లు తక్కువగా ఉండటం భారత్‌కు కలిసొచ్చింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దిగుమతి చేసుకున్న ముడి చమురుకు 16 శాతం తక్కువ మొత్తాన్ని చెల్లించింది. అయితే అదే సమయంలో దిగుమతులు గరిష్ట స్థాయికి చేరుకోవడం గమనార్హం. భారత్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2023 నుండి మార్చి 2024 వరకు) 232.5 మిలియన్ టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకుంది. ఇది గత ఏడాది ఇదే కాలంలో ఇంచుమించుగా ఇంతే మొత్తంగా నమోదైంది. అయితే చమురు రేట్లు తగ్గడంతో ప్రస్తుతం సమీక్ష కాలంలో భారత్ దాదాపు రూ.11 లక్షల కోట్లకు పైగా($132.4 బిలియన్లు) చెల్లించింది. అయితే ఇంతే మొత్తం దిగుమతులకు గత ఏడాది దాదాపు రూ.13 లక్షల కోట్లకు పైగా($157.5 బిలియన్ల) చెల్లింపులు చేసిందని చమురు మంత్రిత్వ శాఖ పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (PPAC) డేటా చూపించింది. 2023-24లో భారత్ ముడి చమురు దిగుమతిపై ఆధారపడటం 87.4 శాతం నుండి 87.7 శాతానికి పెరిగింది.ప్రస్తుతం భారత్ ప్రపంచంలోని మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉంది. దీంతో పాటు, LPG వంటి 48.1 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి భారతదేశం 23.4 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.

Next Story