India-US: ఎగుమతులను కాపాడుకునేందుకు అమెరికా దిగుమతులపై సుంకం తగ్గింపు

by S Gopi |
India-US: ఎగుమతులను కాపాడుకునేందుకు అమెరికా దిగుమతులపై సుంకం తగ్గింపు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌ అధిక సుంకాలు విధిస్తోందని, ఏప్రిల్‌ 2 నుంచి రెసిప్రోకల్ టారిఫ్ తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు కూడా ప్రారంభం అయ్యాయి. అయితే, ప్రతీకార సుంకాల ప్రభావాన్ని తగ్గించేందుకు కేంద్రం కీలక చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇరు దేశాలు చర్చలు జరుపుతున్న వాణిజ్య ఒప్పందం మొదటి దశలో 23 బిలియన్ డాలర్ల(రూ. 1.97 లక్షల కోట్ల) విలువైన అమెరికా దిగుమతులపై సుంకాలను తగ్గించడానికి భారత్ సిద్ధంగా ఉంది. ఈ నిర్ణయం అమలైతే గడిచిన కొన్నేళ్లలోనే అతిపెద్ద సుంకాల కోత అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావాన్ని తగ్గించాలని భారత్ భావిస్తోంది. ప్రతీకార సుంకాల వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లకు అంతరాయం కలిగడమే కాకుండా పాశ్చాత్య మిత్రదేశాలతో కూడా పాలసీల విషయంలో ఇబ్బందులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

సగం వస్తువులపై సుంకం తగ్గింపు

రాయిటర్స్ ప్రకారం.. భారత్ నుంచి అమెరికాకు 66 బిలియన్ డాలర్ల(రూ. 5.66 లక్షల కోట్ల) విలువైన ఎగుమతులు జరుగుతున్నాయి. ప్రతీకార సుంకాలు అమలైతే ఇందులో 87 శాతం ఎగుమతులు ప్రభావితం కానున్నాయి. దీన్ని అధిగమించేందుకు భారత్ దిగుమతి చేసుకునే వాటిలో 55 శాతానికి సమానమైన అమెరికా వస్తువులపై సుంకాలను తగ్గించేందుకు సిద్ధంగా ఉంది. ఈ దిగుమతులపై ప్రస్తుతం 5 శాతం నుంచి 30 శాతం మధ్య సుంకాలు విధిస్తున్నారు. ఈ విభాగంలోని వస్తువులలో అమెరికా నుంచి రూ. 1.97 లక్షల కోట్ల కంటే ఎక్కువ విలువైన వాటిపై గణనీయంగా సుంకాలను తగ్గించడం లేదా కొన్నింటిని పూర్తిగా రద్దు చేసేందుకు భారత్ సానుకూలంగా ఉందని మూలాలు చెప్పినట్టు రాయిటర్స్ తెలిపింది. దీనిపై భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ, ప్రధాన మంత్రి కార్యాలయం, ప్రభుత్వ ప్రతినిధుల నుంచి వివరణ కోరగా బదులివ్వలేదు.

రంగాల వారీగా సుంకం విధింపుపైనా చర్చలు

ప్రపంచ వాణిజ్య సంస్థ గణాంకాల ప్రకారం, అమెరికా సగటున దాదాపు 2.2 శాతం మేర భారత వస్తువులపై సుంకం విధిస్తుండగా, అమెరికా వస్తువులపై భారత్ 12 శాతం మేర విధిస్తోంది. భారత్-అమెరికా మధ్య 45.6 బిలియన్ డాలర్ల(రూ. 3.91 లక్షల కోట్ల) వాణిజ్య లోటు ఉంది. ఈ ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా, రెండు దేశాలు ముందస్తుగా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడం, సుంకాల సమస్యను పరిష్కరించుకోవడంపై చర్చలు ప్రారంభించేందుకు అంగీకరించాయి. ప్రతీకార సుంకాలను ప్రకటించకముందే భారత ప్రభుత్వం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలనుకుంటోంది. ఈ క్రమంలోనే అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్‌ లించ్‌ మార్చి 25-29 మధ్య భారత్‌లో పర్యటించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అమెరికా దిగుమతుల్లో సగానికి పైగా వస్తువులపై సుంకాలను తగ్గించడం ప్రతీకార సుంకం నుంచి ఉపశమనం పొందడంపై ఆధారపడి ఉంటుందని భారత ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు. పన్నుల తగ్గింపు మాత్రమే తుది నిర్ణయం కాదు, రంగాల వారీగా సుంకాలను సర్దుబాటు చేయడం, లేదా అన్నిటిపైన పన్నులను తగ్గించడం కంటే ప్రతి ఉత్పత్తినీ సమీక్షించి నిర్ణయం తీసుకోవడం వంటి మార్గాలపైనా చర్చలు జరుగుతున్నాయని ఓ అధికారి వెల్లడించారు.

Advertisement
Next Story

Most Viewed