‘ఎన్నికల ఏడాదిలో భారత్ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగించింది’

by Harish |
‘ఎన్నికల ఏడాదిలో భారత్ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగించింది’
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఎన్నికలు జరగనున్న ఏడాదిలో భారత్ మంచి ఆర్థిక క్రమశిక్షణను కొనసాగించింది, భారత ఆర్థిక వ్యవస్థ బాగా పనిచేస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF)లోని ఆసియా, పసిఫిక్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ కృష్ణ శ్రీనివాసన్ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ మెరుగైన వృద్దిని కలిగి ఉంది. ఇది ప్రస్తుతం 6.8 శాతం వద్ద ఉంది. ద్రవ్యోల్బణం తగ్గుతోంది. ఇది లక్ష్యానికి అనుగుణంగా మరింత తగ్గేలా చూసుకోవాలని అన్నారు.

సాధారణంగా ఎన్నికల సమయాల్లో దేశాలు చాలా ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకుంటాయి. కానీ భారత్‌లో ఎన్నికలు ఉన్నప్పటికి కూడా ఆర్థిక క్రమశిక్షణను పాటించారని శ్రీనివాసన్ తెలిపారు. భారత్ గత కొన్ని సంవత్సరాలుగా అనేక అడ్డంకులను అధిగమించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా అభివృద్ధి చెందుతోంది. 2024-25 ఏడాది కోసం ప్రైవేట్ వినియోగం, ప్రభుత్వ పెట్టుబడులతో 6.8 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాము. ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతోంది. ఇప్పుడు అది 5 శాతం కంటే తక్కువగా ఉందని ఆయన చెప్పారు.

దేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు కూడా పటిష్టంగా ఉన్నాయి, ఆర్‌బీఐ ప్రకారం, ఏప్రిల్ 5తో ముగిసిన వారానికి భారతదేశ ఫారెక్స్ నిల్వలు USD 2.98 బిలియన్లు పెరిగి 648.562 బిలియన్ డాలర్ల తాజా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దేశంలో ప్రైవేట్ పెట్టుబడిలో ఎక్కువ వృద్ధి కనిపిస్తుంది. ప్రపంచ వృద్ధిలో భారత్ ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. ప్రపంచ వృద్ధిలో భారత్ దాదాపు 17 శాతానికి దోహదపడుతుందని శ్రీనివాసన్ అన్నారు.

Advertisement

Next Story