'విదా' బ్రాండ్‌ను దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో హీరో మోటోకార్ప్!

by Mahesh |
విదా బ్రాండ్‌ను దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో హీరో మోటోకార్ప్!
X

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తమ ఈవీ విభాగాన్ని మరింత విస్తరించాలని భావిస్తోంది. ఈ మేరకు కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గతేడాది అక్టోబర్‌లో కంపెనీ తన కొత్త బ్రాండ్ విదా పేరుతో వీ1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతానికి ఈ బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)ను ప్రధాన నగరాలైన ఢిల్లీ, బెంగళూరు, జైపూర్‌లలో విక్రయిస్తోంది. వినియోగదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వచ్చే 18-24 నెలల్లో దేశవ్యాప్తంగా విస్తరించాలని యోచిస్తున్నట్టు హీరో మోటోకార్ప్ ఎమర్జింగ్ మొబిలిటీ బిజినెస్ యూనిట్ విభాగం హెడ్ శ్రీవాస్తవ అన్నారు.

దేశంలోని ఇతర నగరాలకు విస్తరించడంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్త మోడళ్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. విదా బ్రాండ్ నుంచి మొదటి స్కూటర్ విడుదల చేసిన తర్వాత మూడు నగరాల నుంచి గిరాకీ భారీగా కనిపిస్తోంది. ముందస్తు కొనుగోళ్లకు కూడా కస్టమర్లు సిద్ధంగా ఉండటం తో విస్తరణ చేపట్టాలని నిర్ణయించాం. 2023-24 లో ఈ ప్రక్రియను చేపడతామని శ్రీవాస్తవ పేర్కొన్నారు. కాగా, దేశీయంగా ఈవీల విక్రయాలు గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి. వాహన డీలర్ల సంఘం ఫాడా ప్రకారం, గత ఏడాది ఈవీ అమ్మకాలు 2021 తో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగి 6,28,671 యూనిట్లు విక్రయించబడ్డాయి.

Advertisement

Next Story