AI పై సంచలన వ్యాఖ్యలు చేసిన 'గాడ్‌ఫాదర్ ఆఫ్ ఏఐ'.. గూగుల్‌కు రాజీనామా!

by Harish |
AI పై సంచలన వ్యాఖ్యలు చేసిన గాడ్‌ఫాదర్ ఆఫ్ ఏఐ.. గూగుల్‌కు రాజీనామా!
X

వాషింగ్టన్: టెక్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఇటీవల సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. ఇటీవల వచ్చిన చాట్‌జీపీటీ మరో అడుగు ముందుకు వేసింది. ఈ క్రమంలో 'గాడ్‌ఫాదర్ ఆఫ్ ఏఐ'గా గుర్తింపు ఉన్న జెఫరీ హింటన్ గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్‌కు రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాంసంగా మారింది. అంతేకాకుండా అత్యాధునిక ఏఐని సరైన మార్గంలో వినియోగించకపోతే ప్రమాదం ఏర్పడవచ్చని ఆయన హెచ్చరించారు.

ఏఐ వల్ల జరిగే ప్రమాదాల గురించి ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం లభించిందన్నారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా చెబుతూ, ఏఐ లాంటి టెక్నాలజీ ప్రస్తుతానికైతే మనుషుల కంటే తెలివైనవి కాకపోవచ్చు. కానీ, త్వరలో అవి మనుషుల కంటే ఎక్కువ శక్తివంతంగా మారే అవకాశాలు ఉన్నాయన్నారు. ఉద్యోగాల తొలగింపునకు కారణమవడమే కాకుండా ఏది నిజం, ఏది అబద్ధం అనే విషయం తెలుసుకోలేని ప్రపంచాన్ని అవి సృష్టించగలవని జెఫరీ వివరించారు.

నకిలీ ఫొటోలు, సమాచారం ఎక్కువగా వ్యాపించే ప్రమాదం ఉందని, దీన్ని నియంత్రించడం క్లిష్టమవుతుందన్నారు. గూగుల్ కంపెనీలో పదేళ్లకు పైగా ఏఐ టెక్నాలజీ పరిశోధనల్లో పాల్గొన్న జెఫరీ హింటన్ ఫొటోలను విశ్లేషించే అల్గారిథమ్‌ను రూపొందించారు. ఆయన విద్యార్థుల్లో ఒకరే ఇటీవల వచ్చిన చాట్‌జీపీటీ సృష్టికర్త కావడం విశేషం.

Advertisement

Next Story