త్వరలో కొత్త ఎల్ఐసీ చైర్మన్ ఎంపిక ప్రక్రియను ప్రారంభించనున్న ఎఫ్ఎస్ఐబీ!

by Javid Pasha |
త్వరలో కొత్త ఎల్ఐసీ చైర్మన్ ఎంపిక ప్రక్రియను ప్రారంభించనున్న ఎఫ్ఎస్ఐబీ!
X

న్యూఢిల్లీ: ప్రభుత్వ బ్యాంకులు, ఆర్థిక సంస్థల డైరెక్టర్లను ఎంపిక చేసే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూషన్ బ్యూరో(ఎఫ్ఎస్ఐబీ) ఈ నెలలో బీమా దిగ్గజం ఎల్ఐసీ కొత్త ఛైర్మన్‌ను ఎంపిక చేయవచ్చని తెలుస్తోంది. సంస్థలోని నలుగురు మేనేజింగ్ డైరెక్టర్ల నుంచి ఛైర్మన్ ఎంపిక జరుగుతుంది. సంబంధిత వర్గాల ప్రకారం, ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉన్న కారణంగా ఎంపిక చేసే కమిటీలోని సభ్యులందరూ అందుబాటులో ఉండటాన్ని బట్టి వచ్చే వారం ఆఖరులో ఛైర్మన్ కోసం ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.

ఆ తర్వాత ఎఫ్ఎస్ఐబీ సిఫార్సు మేరకు ప్రధానీ మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఎల్ఐసీ డైర్కెటర్లలో ఒకరైన బిసి పట్నాయక్ మార్చి 31వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో ఇప్పటికే ప్రభుత్వం తబ్లేష్ పాండెని నియమించింది. మార్చి 13న ఎంఆర్ కుమార్ పదవీకాలం పూర్తయిన తర్వాత ప్రస్తుత ఎల్ఐసీ ఎండీ సిద్ధార్థ మొహంతి తాత్కాలిక ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన జూన్‌లో పదవీ విరమణ చేయనుండగా, తదుపరి ఆ పదవికి రేసులో ఇతర ఎండీలైన మినీ ఐపే, ఎం జగన్నాథ్ ఉన్నారు.

ఎల్ఐసీ సంస్థ ఛైర్మన్ పదవీ విరమణ వయసు 62 ఏళ్లు. 2021లో లైఫ్ ఇన్సూరెన్స్ రెగ్యులేషన్స్-1960 సవరణ ద్వారా ఇది 60 ఏళ్ల నుంచి 62కు పెంచారు. ఎస్‌బీఐ సహా కొన్ని సంస్థలను మినహాయించి మెజారిటీ ప్రభుత్వ రంగ సంస్థల టాప్ ఎగ్జిక్యూటివ్‌ల పదవీ విరమణ వయసు 60 ఏళ్లు ఉంటుందని గమనించాలి. కాగా, ఎఫ్ఎస్ఐబీ ఆరుగురు సభ్యుల ప్యానెల్. ఇది దిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ) మాజీ కార్యదర్శి భాను ప్రతాప్ శర్మ నేతృత్వంలో ఉంది.


Advertisement

Next Story

Most Viewed