వేసవికి ముందే ఐస్‌క్రీమ్, సాఫ్ట్‌డ్రింక్‌లకు భారీ గిరాకీ!

by Vinod kumar |
వేసవికి ముందే ఐస్‌క్రీమ్, సాఫ్ట్‌డ్రింక్‌లకు భారీ గిరాకీ!
X

న్యూఢిల్లీ: గత కొంతకాలంగా ఐస్‌క్రీమ్‌లు, సాఫ్ట్‌డ్రింక్‌ల డిమాండ్ గణనీయంగా పెరిగిందని ఎఫ్ఎంసీజీ, డెయిరీ కంపెనీలు వెల్లడించాయి. ఈ ఏడాది వేసివిలో వీటి అమ్మకాలు రెండంకెల స్థాయిలో పెరిగే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. వేసవికి ముందే గిరాకీ అధికంగా ఉన్న నేపథ్యంలో గత రెండేళ్ల నుంచి క్షీణించిన సాఫ్ట్‌డ్రింక్, ఐస్‌క్రీమ్‌ల విక్రయాలు తిరిగి పుంజుకోనున్నాయి. వినియోగదారుల నుంచి పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీలు సైతం కొత్త ఫ్లేవర్లు, ఆఫర్లతో మార్కెట్లో ఉత్పత్తులను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.

ప్రముఖ మదర్ డెయిరీ ఇప్పటికే వేసవి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని తగిన మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచినట్టు తెలిపింది. ఐస్‌క్రీమ్ విభాగం అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ కోల్డ్-చైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను పెంచామని, వాహనాలను, కన్స్యూమర్ టచ్‌పాయింట్లను ఏర్పాటు చేస్తున్నామని సంస్థ ఎండీ మనీష్ చెప్పారు. అలాగే, ఈ సీజన్ కోసం కొత్తగా 15 వేరియంట్లు, ఫ్లేవర్లను తీసుకొచ్చామన్నారు. రానున్న వేసవి సీజన్‌లో ఐస్‌క్రీమ్ విభాగం మాత్రమే దాదాపు 25 శాతం ఎక్కువ వృద్ధి సాధిస్తుందని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. సాఫ్ట్‌డ్రింక్ బ్రాండ్ పెప్సికో సైతం డిమాండ్‌ను తీర్చేందుకు కంపెనీ పోర్ట్‌ఫోలియోలో కొత్త బ్రాండ్‌లను తెచ్చామని పెప్సికో ఇండియా సీనియర్ వైస్-ప్రెసిడెంట్ జార్జ్ కొవుర్ అన్నారు. గత రెండేళ్లలో లేని విధంగా ఈసారి గ్రామిణ, పట్టణ రెండు మార్కెట్లలో గిరాకీ అధికంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story