- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Niti Aayog: ఉపాధి పెరిగినా, జీతాల్లో మార్పు లేదు: నీతి ఆయోగ్ సభ్యుడు అరవింద్ విర్మానీ

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ఉపాధి పెరుగుతున్నప్పటికీ, ఇప్పటికే ఉన్న ఉద్యోగాలకు అవసరమైన స్థాయిలో జీతాలు పెరగట్లేదని నీతి ఆయోగ్ సభ్యుడు అరవింద్ విర్మాని అభిప్రాయపడ్డారు. గడిచిన ఏడేళ్లుగా ద్రవ్యోల్బణం పెరిగిన స్థాయిలో ఉద్యోగుల వేతనాల్లో మార్పు రాలేదని ఆయన తెలిపారు. తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. అధిక జనాభా భారత్‌కు ఉన్న అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం మెరుగైన బోధన, నాణ్యమైన శిక్షణ ముఖ్యం. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(పీఎల్ఎఫ్ఎస్) డేటా ప్రకారం, గత ఏడేళ్ల కాలంలో కార్మిక-జనాభా నిష్పత్తిలో స్పష్టమైన మెరుగుదల ఉంది. అంటే జనాభా పెరుగుదల కంటే ఉద్యోగాల సంఖ్య అధికంగా ఉంది. ఇందులోనూ హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఉద్యోగాల సంఖ్య పెరుగుతోంది. 2023-24(జూలై-జూన్)లో అన్ని వయస్సుల కార్మిక-జనాభా నిష్పత్తి 43.7 శాతానికి పెరిగింది. ఇది 2017-18 నాటి 34.7 శాతం కంటే దాదాపు పది శాతం పెరిగింది.
పీఎల్ఎఫ్ఎస్ డేటాలోనే వేతన వివరాలను పరిశీలిస్తే, ఏడేళ్లలో రోజువారీ కూలీల జీతాలు పెరిగాయి. ఇదే సమయంలో వారి పరిస్థితి కూడా మెరుగుపడటాన్ని గణాంకాలు నిర్ధారిస్తున్నాయి. కానీ, నెలవారీగా జీతం పొందే రెగ్యులర్ ఉద్యోగుల జీతాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేకపోవడం గమనించవచ్చు. ఈ ఏడేళ్లలో ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వారి వేతనం పెరగలేదని అరవింద్ విర్మాని వివరించారు.
దీనికి ప్రధాన కారణం స్కిల్స్ కొరత. దేశంలో నైపుణ్యం ఆధారంగా నియామకాలు జరగటంలేదు. చాలా దేశాల డేటాను గమనిస్తే, స్కిల్స్ విషయంలో మనమింకా బలహీన స్థితిలో ఉన్నాం. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. రాష్ట్రాలు కూడా దీనిపై పనిచేయాలని ఆయన సూచించారు. స్కిల్స్ పెరిగితే ఉత్పాదకత కూడా పెరుగుతుంది. ఇప్పటికే పని చేస్తున్న వారికే కాకుండా కొత్తగా ఉద్యోగాల్లో చేసే వారికి కూడా నైపుణ్యాభివృద్ధి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. నాణ్యమైన విద్య, నైపుణ్యాలు లేకపోవడమే ప్రధాన సమస్య. ప్రతి స్థాయిలో నైపుణ్యాలు మెరుగుపడాలని సూచించారు.