NPCI: 'డిజిటల్ అరెస్ట్' స్కామ్‌ల కట్టడికి మార్గదర్శకాలు విడుదల చేసిన ఎన్‌పీసీఐ

by S Gopi |
NPCI: డిజిటల్ అరెస్ట్ స్కామ్‌ల కట్టడికి మార్గదర్శకాలు విడుదల చేసిన ఎన్‌పీసీఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో డిజిటల్ లావాదేవీలకు అనుగుణంగా సైబర్ మోసాలు కూడా పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, పట్టుబడకుండా సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొంత పంథాలను అనుసరిస్తున్నారు. అలాంటిదే 'డిజిటల్ అరెస్ట్' స్కామ్. ఈ స్కామ్‌లో సామాన్యులకు పోలీస్, ఈసీ, సీబీఐ అధికారులమని చెప్పుకుని మనీలాండరింగ్, డ్రగ్స్ లాంటి కేసులతో బెదిరించి, బ్యాంకు ఖాతా వివరాలు సేకరించి స్కామర్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) డిజిటల్ చెల్లింపుల రంగంలో అభివృద్ధి చెందుతున్న 'డిజిటల్ అరెస్ట్' స్కామ్ గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి పబ్లిక్ అడ్వైజరీని విడుదల చేసింది. ఈ ఘటనల్లో వ్యక్తిగత, ఆర్థిక డేటాను రక్షించుకునేందుకు ఆన్‌లైన్ స్కామ్‌లను గుర్తించి వాటి బారిన పడొద్దని సూచించింది.

'డిజిటల్ అరెస్ట్' స్కామ్‌లను గుర్తించేందుకు ఎన్‌పీసీఐ పలు సూచనలు జారీ చేసింది. అందులో ఎవరైనా పోలీసు, సీబీఐ, కస్టమ్స్ అధికారులం అంటూ ఫోన్ చేస్తే తక్షణం ఫిర్యాదు చేయాలని, స్కామర్లు వీడియో కాల్స్ ద్వారా పోలీసు యూనిఫాంలు ధరించి కనిపిస్తే కంగారు పడొద్దని, స్కామర్ల నుంచి బెదిరింపులు వస్తే 1930 నంబర్‌కు డయల్ చేసి జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని తెలిపింది. స్కామర్ల బెదిరింపులకు లొంగి వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా, ఇతర లావాదేవీల వివరాలు ఇవ్వొద్దని, చెల్లింపులు లాంటివి అస్సలు చేయొద్దని పేర్కొంది. స్కామర్లు వ్యక్తిగత సమాచారం అడిగినా, చట్టపరమైన సమస్యల పరిష్కారం పేరుతో డబ్బు అడిగినా ఇవ్వొద్దని స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed