రేపటి వరకు అంబేద్కర్ విగ్రహానికి వేసిన తాళాలు తీయాలి.. బీఆర్ఎస్ నేత సంచలన డిమాండ్

by Ramesh Goud |
రేపటి వరకు అంబేద్కర్ విగ్రహానికి వేసిన తాళాలు తీయాలి.. బీఆర్ఎస్ నేత సంచలన డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అడుగడుగునా అంబేద్కర్ ను అవమానిస్తోందని, అంబేద్కర్ విగ్రహానికి వేసిన తాళాలు ఇప్పటికైనా తొలగించాలని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ (BRS Leader Errolla Srinivas) డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) మొదటి నుంచి బీఆర్ అంబేద్కర్ (BR. Ambedkar) ను అవమానిస్తూనే ఉన్నదని, నాటి నెహ్రు (Nehru) నుంచి నేటి రాహుల్ గాంధీ (Rahul Gandhi), రేవంత్ రెడ్డి (Revanth Reddy)ల వరకు అడుగడుగునా అవమానాలకు గురి చేస్తుందని మండిపడ్డారు.

అంబేద్కర్ అంటే కాంగ్రెస్ నాయకులకు అంత అలుసా.. అంబేద్కర్ లేకుంటే ఈ రాష్ట్రం వచ్చేదా.. ఆయన లేకుంటే మీకు రాజ్యాదికారం ఎక్కడిదని ప్రశ్నించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం మాట్లాడారని, రాజకీయ సోయి ఉన్న ఎవరైనా, రాజ్యాంగం తెలిసిన వారు ఎవరైనా అంబేద్కర్ ను పలానా వర్గానికి చెందిన వాడు అని మాట్లాడరు అని ఫైర్ అయ్యారు. అంబేద్కర్ లేకుంటే ఈ రాజకీయ వ్యవస్థ, పార్లమెంటరీ వ్యవస్థ, పరిపాలన వ్యవస్థలు లేనే లేవని, ఆనాడు అంబేద్కర్ సమసమాజ స్థాపన కోసం దేశ ఔన్నత్యాన్ని పెంచడం కోసం, చాలా దేశాల రాజ్యాంగాలను క్రోడీకరించి ఈ దేశ రాజ్యాంగం రాసి మన చేతిలో పెట్టారని అన్నారు.

కానీ ఈనాటి కాంగ్రెస్ పార్టీ అదే అంబేద్కర్ కు కులాలను అంటగట్టి అవమానించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) 16 నెలల నుంచి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి (125 Feet Ambedkar Statue) తాళాలు వేసిందని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా ఎమ్మెల్యేలు అయిన కాంగ్రెస్ నేతలు తాళాలు తీయాలని చెప్పి రేవంత్ రెడ్డి దగ్గరకి వెళ్లి ధర్నా చేయాలని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికైనా తాళాలు తీయాలని.. లేదంటే అంబేద్కరిస్టులతో కలిసి అక్కడికి వచ్చి తాళాలు తీసే వరకు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రేపు ఉదయం వరకు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఉన్న తాళాలు తీయాలని ఎర్రోళ్ల డిమాండ్ చేశారు.

Next Story