ఫిబ్రవరిలో స్వల్పంగా తగ్గిన క్రెడిట్ కార్డుల కొనుగోళ్లు!

by sudharani |
ఫిబ్రవరిలో స్వల్పంగా తగ్గిన క్రెడిట్ కార్డుల కొనుగోళ్లు!
X

ముంబై: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) తాజా డేటా ప్రకారం, ప్రస్తుత ఏడాది ఫిబ్రవరిలో క్రెడిట్ కార్డుల ద్వారా చేసే ఖర్చులు స్వల్పంగా తగ్గాయి. అంతకుముందు జనవరిలో రూ. 1.3 లక్షల కోట్ల విలువైన క్రెడిట్ ద్వారా కొనుగోళ్లు నమోదవగా, ఫిబ్రవరిలో దాదాపు రూ. 1.2 లక్షల కోట్లు జరిగాయి. మొత్తం ఖర్చులో ఈ-కామర్స్ వాటా 62.4 శాతం ఉండగా, దీని తర్వాత పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ వద్ద 37.8 శాతంగా ఉన్నాయి. మిగిలిన వాటా ఇతర రూపాల్లో జరిగాయని గణాంకాలు తెలిపాయి. సాధరణంగా ఫిబ్రవరి నెలలో ఇతర నెలల కంటే తక్కువ రోజులు ఉంటాయి కాబట్టి క్రెడిట్ కార్డు ద్వారా చేసే ఖర్చులు తక్కువగా ఉంటాయి. మార్చిలో ఇది పెరగవచ్చు.

గత కొంతకాలంగా నిత్యావసర బిల్లుల చెల్లింపులు క్రెడిట్ కార్డుల ద్వారా నిర్వహించడాన్ని గమనిస్తున్నాం. ఒకరకంగా ఇది క్రెడిట్ కార్డు లావాదేవీల వృద్ధికి సానుకూలమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. క్రెడిట్ కార్డులను జారీ చేసే బ్యాంకులు ఇతర సంస్థలు నెలవారీ ఈఎంఐ ఆఫర్‌లను మెరుగుపరచడంపై దృష్టి సారించాయి. దీనివల్ల మరింత మంది వినియోగదారులకు క్రెడిట్ కార్డు కిందకు తీసుకురావడం, ఆదాయం మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సమీక్షించిన నెలలో కొత్తగా 9.1 లక్షల మంది క్రెడిట్ కార్డులను పొందగా, జనవరిలో 12.7 లక్షల కంటే ఇది తక్కువ. కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయడంలో యాక్సిస్ బ్యాంకు ముందుండగా, ఐసీఐసీఐ వెనకబడిందని గణాంకాలు పేర్కొన్నాయి.

Advertisement

Next Story