నోట్ల రద్దు ఎఫెక్ట్: మూడో కంటికి తెలియకుండా లావాదేవీలు జరిగే ఛాన్స్!

by GSrikanth |   ( Updated:2023-05-19 23:46:02.0  )
నోట్ల రద్దు ఎఫెక్ట్: మూడో కంటికి తెలియకుండా లావాదేవీలు జరిగే ఛాన్స్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రెండు వేల రూపాయల నోట్లపై ఆర్మీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో మూడో కంటికి తెలియకుండా జరిగే లావాదేవీలపైనే ఇప్పుడు ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. బ్యాంకు మేనేజర్ల స్థాయిలోని అధికారులతో వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు లోపాయకారీగా ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఎక్కువేననే గుసగుసలు వినిపిస్తున్నాయి. బ్యాంకుల దగ్గర ఇప్పుడున్న రూ. 500 నోట్లు క్రమంగా వ్యాపారులు, పొలిటీషియన్ల చేతుల్లోకి వెళ్ళిపోతాయని బహిరంగంగానే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనికి తోడు రోజూ లక్షలు, కోట్ల రూపాయల్లో వ్యాపారం చేసేవారితో దందాలు కుదురుతాయని, నోట్లను మార్చినందుకు నిర్దిష్ట మొత్తంలో కమిషన్ తీసుకునే కొత్త బిజినెస్ తెరపైకి వస్తుందనే మాటలూ వినిపిస్తున్నాయి. ఈ తరహా బిజినెస్ సెప్టెంబరు వరకూ కంటిన్యూ అవుతుందని, నల్లధనం ఈ రూపంలో వైట్‌గా మారుతుందని వీరి మాటల ద్వార వ్యక్తమవుతున్నది.

బ్యాంకు అధికారులు, సిబ్బందితో ఒప్పందం కుదిరితే ఎంచక్కా రెండు వేల నోట్లన్నీ బ్యాంకుల్లోకి వెళ్ళిపోతాయి. అక్కడున్న ఇతర నోట్లు వీరి చేతుల్లోకి మారిపోతాయి. ఈ మధ్యలో జరిగిన వ్యవహారానికి కొంత మొత్తం కమిషన్ రూపంలో చేరిపోతుంది. హవాలా వ్యాపారం చేసే, అక్రమ దందాలకు పాల్పడేవారు కూడా ఇలాంటి దొడ్డిదారుల్లో నోట్ల మార్పిడికి ప్రయత్నాలు మొదలుపెడతారు. ఎక్కువ మంది సిబ్బందిగా ఉండే కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు వారి సిబ్బంది ద్వారానే బ్యాంకుల్లో డిపాజిట్ చేసి తిరిగి వారి నుంచి ఇతర నోట్లను తీసుకునే యాక్టివిటీ షురూ అవుతుంది. ఇలాంటి బినామీ లావాదేవీలు పెరిగే అవకాశం ఉన్నది. ఇలాంటి అవకాశాన్ని దృష్టిలో పెట్టుకునే ఐటీ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టడానికి రెడీ అవుతున్నారు. సెప్టెంబరు వరకూ జరిగే బ్యాంకు లావాదేవీలను విశ్లేషించిన తర్వాత అక్టోబరు నుంచి యాక్షన్‌ను మొదలుపెట్టనున్నారు.

Advertisement

Next Story