SBI ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తెలుగు వ్యక్తి

by Harish |
SBI ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తెలుగు వ్యక్తి
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) కొత్త ఛైర్మన్‌‌గా తెలుగు వ్యక్తి చల్లా శ్రీనివాసులు శెట్టి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఈ పదవిలో ఉన్న దినేష్ ఖరా మంగళవారం పని వేళలు ముగిసే సమయానికి పదవీ విరమణ చేయడంతో బుధవారం నుంచి ఎస్‌బీఐ 27వ ఛైర్మన్‌గా శెట్టి నియామకం అమల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

ఈ ఏడాది జూన్‌లో ప్రభుత్వ ప్యానెల్ శెట్టిని ఎస్‌బీఐ కొత్త ఛైర్మన్‌గా ఎంపిక చేసింది. తెలంగాణలోని ప్రస్తుత జోగులాంబ గద్వాల జిల్లా పెద్దపోతుల పాడులో శెట్టి జన్మించారు. ఇంతకుముందు వరకు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న ఆయన 1988లో ఎస్‌బీఐలో ప్రొబెషనరీ ఆఫీసర్‌గా జాయిన్ అయ్యారు. తర్వాత అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత పదవిని అలంకరించారు. శెట్టికి బ్యాంకింగ్ రంగంలోనే 35 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తన కెరీర్‌లో, కార్పొరేట్ క్రెడిట్, రిటైల్, డిజిటల్, అంతర్జాతీయ బ్యాంకింగ్, అభివృద్ధి చెందిన మార్కెట్‌లలో బ్యాంకింగ్‌లో పనిచేశారు.

అంతకుముందు ప్రభుత్వ ప్యానెల్ శెట్టిని ఎస్‌బీఐ ఛైర్మన్‌‌గా ఎంపిక చేయడంపై తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. శెట్టి మూడేళ్లు ఈ పదవిలో ఉండనున్నారు. జూన్ 30, 2027న ఆయన పదవీ విరమణ వయస్సు వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే కొనసాగనున్నారు. కొత్త బాధ్యతలు చేపట్టిన శెట్టి, రుణ వృద్ధి, CASA, AI సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది

Advertisement

Next Story

Most Viewed