స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న లాభాలు!

by Harish |
స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న లాభాలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో లాభాలు కొనసాగుతున్నాయి. ఒకరోజు సెలవు తర్వాత ప్రారంభమైన సూచీలు సోమవారం ఉదయం నుంచే సానుకూలంగా ర్యాలీ చేశాయి. దేశీయ మార్కెట్లలో కొనసాగిన విదేశీ పెట్టుబడులు, ఏప్రిల్ నెలకు సంబంధించి రికార్డు జీఎస్టీ ఆదాయంతో పాటు కీలక ఐటీ రంగంలో కొనుగోళ్ల మద్దతు మదుపర్ల సెంటిమెంట్‌ను పెంచాయి. వీటికి తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, మార్చి త్రైమాసికంలో కంపెనీలు మెరుగైన ఆదాయ వివరాలను వెల్లడించడం వంటి అంశాలు వరుసగా ఎనిమిదో రోజు లాభాలకు కారణమయ్యాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 242.27 పాయింట్లు ఎగసి 61,354 వద్ద, నిఫ్టీ 82.65 పాయింట్లు లాభపడి 18,147 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఫార్మా, ఎఫ్ఎంసీజీ, రియల్టీ రంగాలు బలహీనపడగా, మెటల్, ఐటీ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, మారుతీ సుజుకి, ఇన్ఫోసిస్, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాలను సాధించాయి. సన్‌ఫార్మా, అల్ట్రా సిమెంట్, భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 81.87 వద్ద ఉంది.

Advertisement

Next Story