ఎయిర్‌టెల్‌కు కోటి మంది 5జీ వినియోగదారులు!

by Harish |
ఎయిర్‌టెల్‌కు కోటి మంది 5జీ వినియోగదారులు!
X

న్యూఢిల్లీ: టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ దేశవ్యాప్తంగా తన 5జీ వినియోగదారుల సంఖ్య కోటికి చేరిందని సోమవారం ప్రకటించింది. దేశంలో 5జీ నెట్‌వర్క్ ప్రారంభమైన కొన్ని నెలల వ్యవధిలోనే కోటి మంది వినియోగదారుల మార్కును చేరుకోవడం సంతోషంగా ఉందని, ఇదే ఉత్సాహంతో వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలోని ప్రతి పట్టణం తో పాటు ముఖ్యమైన గ్రామీణ ప్రాంతాల్లో 5జీ సేవలను అందిస్తామని ఎయిర్‌టెల్ ఓ ప్రకటనలో తెలిపింది.

2022, అక్టోబర్ 1వ తేదీన మొదటిసారిగా 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు ఎయిర్‌టెల్ వెల్లడించింది. ఆ తర్వాత నవంబర్ నాటికి అధికారికంగా ప్రారంభించిన 30 రోజుల్లోనే కంపెనీ 10 లక్షల 5జీ వినియోగదారులను కలిగి ఉన్నామని, ఆ ఘనతను సాధించిన మొదటి టెలికాం సేవల సంస్థగా అవతరించామని ఎయిర్‌టెల్ పేర్కొంది.

5జీ సేవలు మొదలైన రోజుల వ్యవధిలోనే ఈ మైలురాయిని చేరడం మరింత ప్రోత్సాహకరంగా ఉంది. అలాగే, ప్రస్తుతం ఉన్న ప్లాన్‌ల ఆధారంగానే వేగవంతమైన 5జీ ఇంటర్నెట్‌ను వినియోగదారులు పొందవచ్చని, అందుకోసం సిమ్ కార్డు మార్చాల్సిన పని లేదని స్పష్టం చేసింది. 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్ ఉండటం ద్వారా సేవలు పొందవచ్చని వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed