భారత ఈవీ మార్కెట్‌పై కన్నేసిన టెస్లా ప్రత్యర్థి

by S Gopi |
భారత ఈవీ మార్కెట్‌పై కన్నేసిన టెస్లా ప్రత్యర్థి
X

దిశ, బిజినెస్ బ్యూరో: లాభాల్లేని ఒక చిన్న ఈవీ కంపెనీ టెస్లా, టయోటా లాంటి కంపెనీల తర్వాత ప్రపంచంలోనే మూడవ అత్యంత విలువైన ఆటో తయారీ కంపెనీగా అవతరించింది. జనరల్ మోటార్స్, ఫోర్డ్ మోటార్‌లను అధిగమించిన ఆ కంపెనీయే విన్‌ఫాస్ట్ ఆటో. గతేడాది ఆగష్టులో అమెరికా నాస్‌డాక్‌లో లిస్ట్ అయిన ఈ కంపెనీ ఇప్పటివరకు ఏకంగా 700 శాతం పెరగడం గమనార్హం. తాజాగా విన్‌ఫాస్ట్ భారత మార్కెట్లోనూ అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. 2017లో ఏర్పాటైన విన్‌ఫాస్ట్ కంపెనీ 2021లో ఈవీలను తయారు చేయడం ప్రారంభించింది. వియత్నాంకు చెందిన అతిపెద్ద విన్ గ్రూప్ ఈ కంపెనీకి మద్దతిస్తోంది. ఈ నెల 25న తమిళనాడులోని తూత్తుకుడిలో 20 బిలియన్ డాలర్ల విలువ ఇంటిగ్రేటెడ్ ఈవీ ప్లాంటును ప్రారంభించనున్నట్టు సమాచారం. కిట్ అసెంబ్లీ ప్లాంట్‌ను విన్‌ఫాస్ట్ ఏర్పాటు చేయనుంది.

విన్‌ఫాస్ట్ కంపెనీ టెస్లాతో పోలిస్తే పరిమాణంలో చాలా చిన్నది. అయినప్పటికీ టెస్లాకు పోటీగా ఎదుగుతోంది. 50 శాతం కంటే ఎక్కువ మార్కెట్ ఉన్న అమెరికాలో ఎలాన్ మస్క్ కంపెనీని ఎదుర్కొనేందుకు గట్టి ప్రణాళికను కలిగి ఉంది. ప్రస్తుతం విన్‌ఫాస్ట్‌కు వియాత్నాంలోని హైఫాంగ్‌లో తయారీ కేంద్రం ఉంది. గతేడాది అమెరికా నార్త్ కరోలినాలో మొదటి దశ 1.50 లక్షల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఫ్యాక్టరీని ప్రారంభించింది. 2023లో కంపెనీ మొత్తం 34,855 ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)ను డెలివరీ చేసింది. 2021 నుంచి ప్రపంచవ్యాప్తంగా కంపెనీ 42,291 ఈవీలను అందజేసింది.

దేశీయంగా ఈవీలకు భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో విన్‌ఫాస్ట్ తమిళనాడులో తయారీతో పాటు దేశవ్యాప్తంగా డీలర్‌షిప్ నెట్‌వర్క్‌లను ప్రారంభించాలని భావిస్తోంది. దీనివల్ల దేశీయంగా ఉనికిని కలిగి ఉండటంతో పాటు వినియోగదారులకు చేరువ కావాలని చూస్తోంది. అంతేకాకుండా తమిళనాడులో తయారీ ద్వారా ఆగ్నేయాసియా మార్కెట్లకు ఎగుమతులపై కంపెనీ దృష్టి సారించనుంది. విన్‌ఫాస్ట్‌కు టెస్లాతో సమానమైన బ్రాండ్ విలువ లేకపోయినప్పటికీ, టెస్లాకు ప్రత్యామ్నాయంగా వినియోగదారులు దీన్ని ఎంచుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తక్కువ ఖర్చు, పెట్టిన సొమ్ముకు విలువ ఆశించే భారత మార్కెట్లో విన్‌ఫాస్ట్ బ్రాండ్‌కు ఆదరణ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. విన్‌ఫాస్ట్ ప్రీమియం విభాగంలో అమ్మకాలను సాధించవచ్చు. ముఖ్యంగా దేశీయ వాహన మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి ఇతర లగ్జరీ బ్రాండ్ల కంటే ఎక్కువ పోటీ ధరలకు ప్రీమియం ఫీచర్లు అందించడం ద్వారా విన్‌ఫాస్ట్ వేగంగా వృద్ధి చెందవచ్చు.

Advertisement

Next Story

Most Viewed