- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కలెక్టర్ నెత్తిన భారం వేశారు.. విచారణ ఎలా?
దిశ, తెలంగాణ బ్యూరో : పెండింగ్ భూ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దశాబ్దాలుగా పడి వివాదాలను కలెక్టర్ల చేతిలో పెట్టారు. ఇప్పుడు ప్రతి అంశానికి కలెక్టరే సర్వాధికారిగా మారారు. ప్రతి అంశానికి కలెక్టరే బాధ్యత వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. వీఆర్వోల వ్యవస్థ రద్దుతో క్షేత్రస్థాయి దర్యాప్తు ఇబ్బందికరంగా మారింది. ధరణి పోర్టల్ ద్వారా అందే ప్రతి దరఖాస్తుతో పాటు పెండింగు సమస్యల పరిష్కారం కలెక్టర్లపైనే పడింది. కనీసం తహసీల్దార్ నివేదికను పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం కూడా లేదు.
ఓ వైపు సంక్షేమ పథకాలు అమలు, మరోవైపు భూ సంబంధ అంశాల అమలు బాధ్యత కలెక్టర్లపైనే వేశారు. పార్టు బీ వివాదాలు కూడా లక్షల్లో ఉన్నాయి. ప్రతి రెవెన్యూ గ్రామంలోనూ 15 నుంచి 20 శాతం వరకు సర్వే నెంబర్లు వివాదాస్పదంగా ఉన్నాయి. పట్టాదారు పాసు పుస్తకాల్లోనూ విస్తీర్ణాలు పొరపాటుగా నమోదయ్యాయని, కొన్ని సర్వే నెంబర్లను మిస్ చేశారంటూ రోజూ అధికారుల చుట్టూ తిరుగుతున్న వారి సంఖ్య కూడా వేలల్లోనే ఉంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం వారంతా తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరోసారి మీ సేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. పెండింగ్ మ్యూటేషన్లు, డిజిటల్ సంతకాలు పెండింగ్, ఎన్ఆర్ఐలు, కంపెనీలు పాసు పుస్తకాల కోసం పెద్ద సంఖ్యలోనే దరఖాస్తులు సమర్పిస్తున్నారు. వీటిని కలెక్టర్ల లాగిన్ లోకి వెళ్తాయి. ఆయనే స్వయంగా పరిశీలించి ఆమోదించాలి. ప్రతి దరఖాస్తును, అప్ లోడ్ చేసిన డాక్యుమెంట్లను చూసి, ధరణితో సరిపోల్చుకొని ఓకే చెప్పేందుకు ఎంత సమయం పడుతుందని అందరికీ అనుమానం కలుగుతోంది. ట్రిబ్యునల్ తో పాటు పెండింగ్ దరఖాస్తులను స్వయంగా ఐఏఎస్ అధికారి చూడడం సాధ్యమేనా? అని రెవెన్యూ అధికారులు, సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. ప్రతి అంశానికి కలెక్టరే బాధ్యుడైతే పనులు త్వరితగతిన పూర్తి చేయడం కష్టమన్న విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి ఉన్నతాధికారులు తీసుకెళ్లలేదని సమాచారం.
9 లక్షలకు పరిష్కారం
రాష్ట్ర వ్యాప్తంగా సాదాబైనామాలను క్రమబద్ధీకరించాలని గతేడాది అక్టోబర్ 10 నుంచి 29 వరకు 2,26,693 దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత అక్టోబర్ 29 నుంచి నవంబరు 10వ తేదీ 6,74,201 దరఖాస్తులు వచ్చాయి. ఈ మూడేండ్ల కాలంలోనే ఏకంగా 9 లక్షల లావాదేవీలు తెల్ల కాగితాల మీద ఎందుకు జరిగాయని ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నారు. వీటిలో బోగస్ ఎన్ని? నిజమైనవి ఎన్ని? అనే విషయాన్ని పరిశీలించాల్సిన బాధ్యత కూడా కలెక్టర్లపైనే ఉంచింది. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలించడం ఎంత వరకు సాధ్యం? నోటీసులు ఎవరు జారీ చేయాలి? వాదనలు ఎవరు వినాలి? రిపోర్టు ఎవరు తయారు చేయాలి? ఇవన్నీ కలెక్టర్ స్వయంగా చేసుకోవడమంటే దరఖాస్తుల పరిష్కారం మూడు నెలల్లో సాధ్యం కాదని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. వీఆర్వో చేసిన పని కూడా ఇప్పుడు ఐఏఎస్ అధికారి చేయాల్సి వస్తుందని ఓ నాయకుడు అన్నారు. గ్రామ స్థాయికి వచ్చి దర్యాప్తు చేసేంత సమయం కలెక్టర్లకు ఉంటుందా? ఎన్ని రోజులు సమయం ఇస్తారని సందేహం వ్యక్తం చేశారు.
ద్విపాత్రాభినయంలో తహసీల్దార్లు
మండల స్థాయిలో తహసీల్దార్లు ద్విపాత్రాభినయం పోషిస్తున్నారు. ఉదయం జాయింట్ రిజిస్ట్రార్ గా, మధ్యాహ్నం తహసీల్దార్ గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఒక్కో రెవెన్యూ ఇన్ స్పెక్టర్లకు పది గ్రామాలకు పైగానే ఉన్నాయి. అవినీతికి పాల్పడుతున్నారన్న నెపంతో వీఆర్వోల వ్యవస్థను రద్దు చేశారు. ఈ క్రమంలో గ్రామ స్థాయి పనులను కూడా రెవెన్యూ ఇన్ స్పెక్టర్, తహసీల్దార్ చేసుకోవడం అనివార్యంగా మారింది. ఈ క్రమంలో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో వీరికీ బాధ్యత అప్పగించినా భారంగానే మారుతోందని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
పార్టు బీ.. సాధ్యమేనా?
పార్టు బీ కింద ప్రతి గ్రామంలోనూ పట్టాదారు పాసు పుస్తకాల జారీని 15 నుంచి 20 శాతం వరకు నిలిపివేశారు. ఈ క్రమంలో వాటిలో గుర్తించిన సర్వే నంబర్లలో విస్తీర్ణాల వ్యత్యాసం ఎంత.. తేడాలెందుకొచ్చాయి.. ధరణిలో నమోదు కాకుండా మిస్సయిన సర్వే నంబర్లు, పట్టాదారు పాస్ పుస్తకాలలో తప్పులు నమోదు చేసిన విస్తీర్ణాల సవరణ, సరిహద్దు వివాదాలు ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.
తహసీల్దార్లపై ఒత్తిడి
ప్రభుత్వం నిర్దేశించినట్లుగా పెండింగ్ సమస్యల పరిష్కార బాధ్యత పూర్తిగా కలెక్టర్లపైనే ఉన్నది. రెవెన్యూ ట్రిబ్యునళ్లలోని కేసులు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఎల్టీఆర్ కేసులు నెల రోజుల్లో, పెండింగ్ మ్యూటేషన్లు, కంపెనీలకు, సంస్థలకు పాసు పుస్తకాలు, పాసు పుస్తకాల్లో విస్తీర్ణం తగ్గిన కేసులు వారం రోజుల్లో, సాదా బైనామాల దరఖాస్తుల పరిశీలన మూడు నెలల్లో పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. ఈ కాల పరిమితిలో లక్షల్లో ఉన్న కేసుల పరిష్కారం సాధ్యం కాదని తెలుస్తోంది. అన్ని రకాల కేసులు కలిపి చూస్తే ఏకంగా 15 లక్షలకు పైగానే ఉన్నాయని సమాచారం. వీటిలో సగానికి పైగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి, నలుగురిని విచారిస్తే తప్ప వాస్తవాలు తెలుసుకోలేరు. అలాంటి పరిస్థితుల్లో తీరిక లేకుండా గడుపుతోన్న కలెక్టర్లు వీటిని ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి. కొన్ని జిల్లాల్లో తహసీల్దార్లపై కలెక్టర్లు ఒత్తిడికి గురి చేస్తున్నట్లు తెలిసింది. ఏ రోజుకారోజు నివేదికలు పంపాలని ఆదేశిస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో పరిశీలించేందుకు ఉద్యోగులెవరూ లేరు. దీంతో రెవెన్యూ యంత్రాంగం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పెండింగు దరఖాస్తుల క్లియరెన్స్ కు ఎంత కాలం పడుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి.