బెల్లంపల్లిలో రూల్స్‌కు వ్యతిరేకంగా కట్టడాలు

by Aamani |
బెల్లంపల్లిలో రూల్స్‌కు వ్యతిరేకంగా కట్టడాలు
X

దిశ, బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలో అక్రమ నిర్మాణాల పట్ల దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకునేందుకు జిల్లా యంత్రాంగం పట్టణంలో టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. బెల్లంపల్లిలో ప్రభుత్వ భూములను కాపాడాలని ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఆదేశాలతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వెనువెంటనే ప్రభుత్వ భూములను కాపాడడంతో పాటు అక్రమ నిర్మాణాలను నిరోధించాలని సంకల్పంతో మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయంతో టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌కు శ్రీకారం చుట్టడం జరిగింది.

ఇలా ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీపై విమర్శలు వస్తున్నాయి. ఆర్థిక, రాజకీయ నేపథ్యం కలిగిన వ్యక్తులుగా పేరొందిన బడాబాబులు నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాల పట్ల దృష్టి సారించక, కేవలం పేద మధ్య తరగతి వారు నిర్మిస్తున్న నివాస నిర్మాణాలను పరిశీలించడం, చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేయడం విడ్డూరంగా ఉందని పట్టణవాసులు వాపోతున్నారు. దీనికి తోడు మున్సిపల్ యంత్రాంగం సైతం ప్రభుత్వ భూముల్లో నిర్మిస్తున్న కట్టడాలకు అనుమతులు జారీ చేయకపోవడం, అనుమతులు జారీ చేయకపోయినా నిర్మాణాలు కొనసాగుతూనే ఉండటం గమనార్హం.

ఇదే విషయమై మున్సిపల్ అధికార యంత్రాంగాన్ని ప్రశ్నిస్తే ప్రభుత్వ భూములు పట్టణంలో ఉన్నందున నిర్మాణ అనుమతులకు ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులతో కుమ్మక్కై అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో అంటూ స్థానికులు వేచిచూస్తున్నారు. ఇకనైనా కొత్తగా ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ బృందం ప్రభుత్వ భూములకు రక్షణ కల్పింస్తుందో లేదో అంటూ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed