ఇల్లు కట్టడానికి బెల్లం, గుడ్లు ఉంటే చాలు!

by Shyam |
ఇల్లు కట్టడానికి బెల్లం, గుడ్లు ఉంటే చాలు!
X

సాధారణంగా ఇల్లు నిర్మించాలంటే కావాల్సినవి సిమెంటు, ఇటుక, ఇసుక. అయితే చెన్నైకి చెందిన జవహర్‌కి, ఆయన సివిల్ ఇంజినీర్ మేనల్లుడు అరవింద్‌కి మాత్రం ఇటుక, ఇసుకలతో పాటు బెల్లం, కోడి గుడ్లు ఉంటే చాలు. కొంచెం నెమ్మదిగానైనా సరే పర్యావరణానికి ఎలాంటి హాని కలుగజేయని ఇంటిని నిర్మిస్తారు. అవును.. నిజమే.. నమ్మకం కలగకపోతే ఆర్టికల్ మొత్తం చదవండి.

పర్యావరణ సహిత గృహాల పేరుతో ఇప్పుడు అందరూ సిమెంటు లేకుండా వెదురు, ఎర్రమట్టితో ఇల్లు నిర్మించుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. కానీ బెల్లం, గుడ్డు తెల్ల సొనతో నిర్మించుకోగల పద్ధతి పూర్వకాలం నుంచే ఉందని అరవింద్ అంటున్నాడు. తమిళనాడులో తిరుపురు జిల్లా వెల్లకొయిలీకి చెందిన జవహర్ కేవలం బెల్లం, గుడ్డు సొనతో 3200 చదరపు అడుగుల్లో ఒక ఇల్లు నిర్మిస్తున్నాడు. ప్రస్తుతకాలంలో ఇల్లు నిర్మించడానికి చేస్తున్న పనులు చాలా కాలుష్యాన్ని సృష్టిస్తున్నాయని, అందుకే తనకు పర్యావరణ సహిత ఇంటిని నిర్మించుకోవాలని మనసు కలిగిందని జవహర్ అన్నారు. అయితే ఆ పని విజయవంతం చేయగల వ్యక్తి తన మేనల్లుడు అరవింద్ మనోహరన్ అని జవహర్ సాయం తీసుకున్నారు.

అరవింద్ 27 ఏళ్ల సివిల్ ఇంజినీర్. ప్రస్తుతం పిళై అళగు అనే సస్టైనబుల్ నిర్మాణ సంస్థను నడుపుతున్నాడు. ఈ సంస్థ ద్వారా ఎకో ఫ్రెండ్లీ గృహాలు నిర్మించడం అరవింద్ పని. తన మేనమామ చెప్పిన పనిని అరవింద్ ఛాలెంజ్‌గా తీసుకుని పరిశోధన ప్రారంభించాడు. పాతకాలంలో ఇల్లు కట్టుకునే విధానాల గురించి సంప్రదాయ మేస్త్రీలను, ముసలి వాళ్లను అడిగి తెలుసుకున్నాడు. జవహర్‌తో కలిసి చాలా మందిని ఇంటర్వ్యూ చేసి ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. వాటన్నిటిలోకెల్లా బెల్లాన్ని సిమెంటులా ఉపయోగించే విధానం అతన్ని బాగా ఆకట్టుకుంది. అలాగే గోడలు పాలిషింగ్ చేసినట్లు కనిపించడానికి గుడ్డు సొన కలిపే విధానం కూడా అరవింద్‌కి ఆసక్తి కలిగించింది. ఇక వెంటనే ఆలోచించకుండా, ఈ విషయాలను చెప్పిన మేస్త్రీలో తనకు పనిలో సాయపడాలని కోరాడు. ఫిబ్రవరి 2019న ఇంటి నిర్మాణం ప్రారంభించాడు.

నిర్మాణం సాగిందిలా…

ఇంటి గోడలు నిర్మించడానికి సంప్రదాయ ఇటుకలనే ఉపయోగించాడు. కానీ వాటిని అంటించడానికి మాత్రం సున్నం, ఇసుక, బెల్లం, నలగ్గొట్టిన కర్కాయ, నీళ్ల మిశ్రమాన్ని ఉపయోగించారు. ఇటుక గోడ మీది నుంచి ఐదు పొరల్లో ప్లాస్టరింగ్ మిశ్రమాన్ని వేశారు. తద్వారా గోడలు తగినంత గాలి పీల్చుకోవడానికి వీలు కల్పించారు. ఈ ఐదు పొరల్లో మొదటి దాంట్లో సున్నం, ఇసుక, నీళ్లు, రెండు, మూడు పొరల్లో సున్నం, కర్కాయ మిశ్రమం, నాలుగో పొరలో సున్నం, టాల్కం పౌడర్ మిశ్రమం, ఇక ఐదో పొరలో సున్నం, గుడ్డు తెల్ల సొన మిశ్రమాలను కలిపారు. అన్ని పొరల్లోనూ సున్నం వాడటం వల్ల ఇంటి లోపల ఎండాకాలంలో చల్లగా, చలి కాలంలో వేడిగా ఉంటే వాతావరణం ఏర్పడుతుంది. ఈ ఇంటి పైకప్పు కోసం కారైకుడి మార్కెట్ నుంచి తీసుకువచ్చిన చెక్కలను, వాటికి చెదలు పట్టకుండా ఉండేందుకు మధ్యలో తామరాకులను ఉంచి అమర్చారు. ఇక ఈ ఇంటికి టైల్స్ వేయడం మాత్రమే బాకీ ఉంది.

Advertisement

Next Story