కరీంనగర్ లో బఫర్ జోన్లు

by Sridhar Babu |
కరీంనగర్ లో బఫర్ జోన్లు
X

దిశ, కరీంనగర్:
కోవిడ్-19 ప్రభావం కారణంగా ఇకనుండి కొన్ని ప్రాంతాల్లో బఫర్ జోన్లు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటి వరకు కంటైన్మెంట్ ఏరియా, నో మూవ్‌మెంట్ జోన్, కార్డన్ ఆఫ్ ఏరియా వంటి వాటినే విన్నాం. కానీ, ఇప్పుడు బఫర్ జోన్లు కూడా అమలు కానున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన విధానం ప్రకారం నోవెల్ కరోనా వైరస్ బాధితుల నివాస ప్రాంతాలను మాత్రమే దిగ్బంధనం చేశారు అధికారులు. బఫర్ జోన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారు నివసించిన ప్రాంతాలే కాకుండా వారు సంచరించిన ఏరియాలను కూడా గుర్తిస్తున్నారు. ఈ బఫర్ జోన్లలోనూ ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు.

ఇందుకోసం ఈ ఏరియాలను కూడా నిర్బంధించి ఆ ప్రాంతవాసులు కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయా కాలనీలవాసులకు కూడా నిత్యావసరాలను అందించనున్నారు. ఈ ప్రాంతాల్లో పోలీసులు తమ వాహనాల్లో నిరంతరం గస్తీ నిర్వహిస్తారు. అక్కడి వారికి కూడా మెడికల్ టీమ్స్ కూడా తరచూ చెకప్ చేయనున్నారు. మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు సంచరించిన ఏరియాలను కూడా బఫర్ జోన్లుగా గుర్తించనున్నట్టు తెలుస్తోంది.

దిగ్బంధనం పొడగింపు

ఇటీవల కాలంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న తీరు అధికార యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేసింది. లక్షణాలున్నవారిని క్వారంటైన్ కు తరలించారు. వారికి టెస్టులు చేసిన అనంతరం పాజిటివ్ వస్తే హైదరాబాద్ కు తరలించేవారు. నెగిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్ సెంటర్ లోనే ఉంచేవారు. అయితే నెగిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్ పిరియడ్ ముగియగానే ఇంటికి పంపి హోం క్వారంటైన్ లో ఉండాలని చెప్పేవారు. కానీ, ఇక నుండి వీరిని కూడా అబ్జర్వేషన్ చేయనున్నారు. ఇటీవల కాలంలో నెగిటివ్ వచ్చినవారికి మరోసారి టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చిన సందర్భాలు ఎదురయ్యాయి. భారత్ తోపాటు ఇతర దేశాల్లోనూ ఇలాంటి రిపోర్ట్స్ రావడంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.

ఎలాంటి లక్షణాలు లేవనుకుని భావించి అనుమానితులను ఇళ్లకు తరలించే విషయంలో కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. మర్కజ్ వెళ్లొచ్చిన వారిలో కొంతమందికి మొదట చేసిన పరీక్షల్లో నెగిటివ్ రావడం, మరోసారి చేసిన టెస్ట్ లో పాజిటివ్ అని తేలడంతో వారిని నిరంతరం కనిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే 14 రోజులు క్వారంటైన్ పీరియడ్ ను 30 రోజుల వరకు పెంచే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అంతేకాకుండా నో మూవ్ మెంట్ జోన్లను మరిన్ని రోజులపాటు దిగ్బంధనంలోనే కొనసాగించాలని భావిస్తున్నట్టు సమాచారం.

Tags: Buffer Zones, Corona, Positive, Markaz, Quarantine

Advertisement

Next Story