జెడ్ కేటగిరీ సెక్యూరిటీని స్వీకరించండి.. ఒవైసీని కోరిన మంత్రి అమిత్ షా

by Disha News Desk |
జెడ్ కేటగిరీ సెక్యూరిటీని స్వీకరించండి.. ఒవైసీని కోరిన మంత్రి అమిత్ షా
X

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కేటాయించిన జెడ్ సెక్యూరిటీని స్వీకరించాలని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీని కేంద్రమంత్రి అమిత్ షా కోరారు. ఎంపీ ప్రయాణిస్తున్న వాహనంపై దాడి నేపథ్యంలో ఆయన పార్లమెంటులో వివరణ ఇచ్చారు. గత వారం ఒవైసీ ప్రయాణిస్తున్న వాహనంపై గుర్తుతెలియన వ్యక్తులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. తర్వాత రోజే కేంద్రం ఆయనకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అయితే తనకు ఏ భద్రతా వద్దని, నిందితులను ఉపా చట్టం కింద శిక్షించాలని ఒవైసీ కోరారు. కేంద్రమంత్రి స్పందిస్తూ 'ఒవైసీకి భద్రతా పరమైన ముప్పు పొంచి ఉంది. కేంద్రం ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ జెడ్ సెక్యూరిటీని కేటాయించింది. కానీ ఆయన తిరస్కరించారు. సభలోని సభ్యుల ద్వారా ఆయన దీనిని అంగీకరించాలని నేను కోరుతున్నాను' అని అన్నారు. ఇప్పటికే కాల్పులకు పాల్పడిన వారిలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అన్నారు. వారిని 14 రోజుల రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. అయితే తన పర్యటనపై ఒవైసీ పోలీసులకు స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని కేంద్రమంత్రి ఆరోపించారు.


Advertisement

Next Story