బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే దాకా వదలం: మంత్రి హరీష్ రావు

by Shyam |
బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే దాకా వదలం: మంత్రి హరీష్ రావు
X

దిశ, గద్వాల, మల్దకల్: కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటం చేద్దామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం జోగులాంబ గద్వాల జిల్లాలో జిల్లా ఆసుపత్రి, నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన చేసిన అనంతరం అయినా మల్దకల్ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ని సందర్శించుకున్న అనంతరం ఎద్దులు బండలాగుడు పోటీలు ప్రారంభించారు. అనంతరం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రైతుల ఆత్మీయ సమ్మేళనం సభలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్ సరఫరా వంటి పథకాలు అమలు చేయడం ద్వారా రికార్డు స్థాయిలో పంటలు అందిస్తున్నారన్నారు.

రైతులు పండించిన వరి ధాన్యాన్ని గత ప్రభుత్వాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేసేవి, కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలుకు ముందుకు రావడం లేదన్నారు. ధాన్యం కొనాలని అంగీకరింప చేసేందుకు వెళ్లిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి బృందానికి కేంద్ర మంత్రులు చర్చలు జరపడానికి అవకాశం ఇవ్వక పోవడమే కాకుండా, అవమానకరంగా మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సింది పోయి రాజకీయ లబ్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు.

రైతులందరూ సమిష్టిగా ఉండి కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. నడిగడ్డ ప్రాంత రైతులు ఇంత పెద్ద ఎత్తున రైతు సంబరాలు కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఉత్సాహం ఇస్తుందన్నారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి జరుగుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రాములు, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, దామోదర్ రెడ్డి, వాణి దేవి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహం, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story